ఇజ్రాయిల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్
. 24 మంది మృతి, అనేకమందికి గాయాలు
. జెరూసలేంలో అమెరికా ఎంబసీపైనా దాడి
. ఖామేనీని హత్యచేసే ఉద్దేశం లేదు: నెతన్యాహు
తెహ్రాన్/టెల్‌అవివ్ : పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రెండు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభిం చింది. దీంతో ఇరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులతోపాటు పదుల సంఖ్యలో అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా అదేరీతిలో ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పడిరది. దీంతో కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు ఇజ్రాయిల్‌లోని అమెరికా రాయబారి మైక్ హుక్కబీ తెలిపారు. అయితే, ఈ దాడిలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సదరు అధికారి తెలిపారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అధికారికంగా మూసివేశారు. ఇజ్రాయిల్‌లో ఏడు లక్షల మంది అమెరికా పౌరులు నివసిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారు ఎంబసీ వెబ్‌సైట్‌లో సమాచారం ఇవ్వాలని మైక్ హుక్కబీ సూచించారు. తమ ఉద్యోగులను సురక్షిత ప్రదేశానికి పంపినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. కాగా ఇరాన్ తన దాడిలో భాగంగా ఇప్పటి వరకు 370 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయిల్ పేర్కొంది. దీంతో పాటు వందలాది సంఖ్యలో డ్రోన్లను కూడా ఇజ్రాయిల్ మీదకు వదిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. సోమవారం ఉదయం వరకు ఇజ్రాయిల్‌లో 24 మంది మరణించారు. మరో 592 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయిల్‌లోని 30 ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే శుక్రవారం నుంచి జరుగుతున్న దాడుల్లో.. ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇరాన్‌లో 224 మంది మరణించారు. ఇరాన్‌కు చెందిన మిలిటరీ చీఫ్‌లను ఇజ్రాయిల్ హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా అలీ ఖామేనీ హత్యకు కూడా ఇజ్రాయిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ప్లాన్‌ను విరమించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్‌పై వత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఖామేనీని హతమార్చే ప్లాన్ తమకు లేదని కూడా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యహూ తెలిపారు.
తెహ్రాన్‌కు మిస్సైల్ లాంచర్లు తీసుకెళ్తున్న ట్రక్కులపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆయుధాలను తీసుకెళ్తున్న అనేక ట్రక్కులను గుర్తించి .. ఇజ్రాయిల్ వైమానిక దళం వాటిపై దాడి చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంచర్లతో పాటు ఇతర ఆయుధాలు ఆ ట్రక్కుల్లో ఉన్నాయి.