Homeగర్జించిన యువత

గర్జించిన యువత

- Advertisement -

విజయవాడలో ఏఐవైఎఫ్ మహా ప్రదర్శన

యువత ఆగ్రహంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం
ప్లకార్డులతో కదంతొక్కిన శ్రేణులు

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: నిరుద్యోగ యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా విజయవాడ నగరంలో యువజన ఆగ్రహం ఉప్పొంగింది. నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన నిరుద్యోగ రణభేరి విజయవాడను కుదిపేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది నిరుద్యోగ యువత, ఏఐవైఎఫ్ శ్రేణులు, వలంటీర్లతో నగరం ఉద్యమ కేంద్రంగా మారింది. విజయవాడ గాంధీనగర్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ధర్నా చౌక్ వరకు శుక్రవారం నిర్వహించిన మహాప్రదర్శనలో యువజన శక్తి వెల్లివిరిసింది. డిగ్రీలు, పీజీలు చేతబట్టి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆగ్రహం నినాదాలుగా ప్రతిధ్వనించింది. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టారు. ప్రతి యువకుడు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, వలంటీర్ల హక్కులు వంటి డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేత పట్టుకుని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి... పాలనను కార్పొరేట్ ప్రయోజనాలకు అంకితం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత గళం గట్టిగా వినిపించింది. మహాప్రదర్శనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చింది. మహాప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర నేతలు, వలంటీర్లు, నిరుద్యోగ యువత భాగస్వాములయ్యారు. అడుగడుగునా కూటమి ప్రభుత్వ దగాకోరు విధానాల్ని తూర్పారబట్టారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ మహా ప్రదర్శన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. యువజన ఉద్యమం కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు గట్టి హెచ్చరికగా నిలిచింది. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే పోరాటాలు మరింత ఉధృతం కావడం ఖాయమన్న సంకేతంతో ఏఐవైఎఫ్ నిరుద్యోగ రణభేరి హెచ్చరించింది. మొజ్జాడ యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు నేతత్వంలో మహా ప్రదర్శన జరిగింది. బాబు ష్యూరిటీభవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పి…అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి గురించి ఆలోచించడం లేదని యువత మండిపడింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఏపీ బేవరేజెస్‌లో పనిచేసిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, వలంటీర్లకు ఎన్నికల హామీ ప్రకారం రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్ వాహనాల్లో తొలగించిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, టెట్ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ప్లకార్డులతో ప్రదర్శన ముందుకు సాగింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లంకా గోవిందరాజులు, వై.బాబి, షేక్ సుభానీ, కొంగర శ్రీనివాసులు, రాంబాబు, కోన శ్రీనివాసరావు, నాగ రాముడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు