. రూ.2,404 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక
. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
. 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా
. మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాల కల్పన
. పాడేరులో నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణంతో పాటు ఆదివాసీల ప్రాంతాలు, నివాసాలకు అనుసంధానం కోసం రూ.2,404 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి పనులు చేపడుతోంది. మారుమూల గిరిజన ప్రాంతాలు, ఆవాసాలను ఏజెన్సీలోని ప్రధాన కేంద్రాలు, ఇతర మైదాన ప్రాంతాలతో అనుసంధానించేలా ప్రభుత్వం రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో వేగం పెంచింది. వచ్చే ఐదేళ్లలో 2,075కు పైగా గిరిజన గ్రామాలకు, నివాసాలను రోడ్లు, వంతెనలతో అనుసంధానించాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోడ్ల కారిడార్లను రూ.41 కోట్లతో చేపట్టనుంది. ఐటీడీఏ చింతూరులో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 50 నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్చడంతో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రూ.50 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తయి ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. పాడేరులో వైద్య కళాశాల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద గిరిజన ప్రాంతాల్లోని 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 నాటికి ఈ పనులు పూర్తి చేసి ఆదివాసీలందరికీ తాగు నీరు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు గిరిజన యువతీయువకులను సన్నద్ధం చేసేందుకు విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను రూ.150 కోట్లతో వసతి గృహాలుగా మార్చే పనులు కూడా జరుగుతున్నాయి. 520కి పైగా పాఠశాల భవనాల నిర్మాణం కోసం రూ.64 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పూర్ణపాడు-కొమరాడ మధ్య నాగావళి నదిపై రూ.10 కోట్లతో హై లెవల్ వంతెనను కూడా చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు ప్రపంచ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీని మరింత విస్తరించేందుకు వీలుగా మన్యంలో ప్లాంటేషన్స్ పెంచేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కాఫీ పల్పింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటంతో పాటు ప్లాంటేషన్ విస్తరణ కోసం రూ.202 కోట్లను ప్రభుత్వం వ్యయం చేయనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా పర్యాటక ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యనిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.7,557 కోట్లను షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపోనెంట్ కింద నిధులు కేటాయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 4.82 లక్షల మంది గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుండగా మరోవైపు సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఇంటిపై సౌరఫలకాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,77,051 మంది గిరిజనులకు ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం రూ.1,595 కోట్లు ఖర్చు చేస్తోంది. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా 4,86,803 మంది గిరిజన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.642 కోట్లను జమ చేసింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనకు ‘మిషన్-2047’ ను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే 1,487 మంది రోగులను గుర్తించి నెలకు రూ.10,000 చొప్పున పింఛన్ ఇస్తోంది. మరోవైపు ప్రకృతి వ్యవసాయం ద్వారా గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహక చర్యలు చేపడుతోంది.
నేడు పాడేరులో ఆదివాసీ దినోత్సవానికి సీఎం చంద్రబాబు
గిరిజనుల హక్కుల పరిరక్షణ`కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్ అనే థీమ్‌తో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లా పాడేరులో శనివారం అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పాడేరు మండలం వంజంగి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. తొలుత మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక గిరిజన సంప్రదాయ వేడుకలకు హాజరవుతారు. ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను సీఎం స్వయంగా తెలుసుకుంటారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడి ఆ తర్వాత లగిసపల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి సమక్షంలో కొన్ని పారిశ్రామిక సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు.


