. పీపీపీ కి10 వైద్య కళాశాలల కేటాయింపు దుర్మార్గం
. కేంద్రంలోని మోదీ విధానాలు రాష్ట్రంలోనూ అమలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రైవేట్ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ… కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లే, రాష్ట్రంలోను చంద్రబాబు కూడా అదే దారిలో నడుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మరోవైపు టూరిజం ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రస్తుతం పర్యాటక రంగంలో పనిచేస్తున్న వెయ్యిమందికి పైగా ఉద్యోగులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తాజాగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు అప్పగించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ డిపోతోపాటు, విశాఖలోని ఆర్టీసీ స్థలాలను లూలూకు అప్పగించేందుకు తీసుకున్న నిర్ణయం కూడా ఇదే కోవలోదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాలల నుంచి ఇంటర్, ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, విశ్వవి ద్యాలయాలు అన్నీ ప్రైవేట్ మయమైపో యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రా, ఎస్కేయూ, ఎస్వీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారు డాక్టరేట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. నేడు ఆ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల స్థానాలను ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆక్రమించుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్య అంటే వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌యూ, గీతమ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పేర్లే వినిపిస్తున్నాయని, ఇంటర్ విద్య అంటే నారాయణ, చైతన్య కళాశాలలే గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల విలువైన 22 హోటళ్లు, రిసార్ట్‌లు, ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని అన్నారు. దీంతో 1,300 మందికిపైగా ఉద్యోగుల కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయని, తాము న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. విద్యాశాఖకు నారా లోకేశ్‌ను మంత్రిగా నియమించినప్పటికీ ఫలితం లేదనీ, మొత్తం విద్యా, వైద్య రంగాలను ప్రైవేట్‌కు అప్పగించడం తగదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం దారుణమని, దీనిపై కార్మిక సంఘాల అధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సి.రామకృష్ణ, పీటీ ప్రసాద్, సీపీఎం నాయకులు వి.కృష్ణయ్య పాల్గొన్నారు.


