ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం
. కొట్టుకుపోయిన ధారాలీ గ్రామం
. ఐదుగురి మృతి… 50 మందికి పైగా గల్లంతు
. మేఘాల విస్ఫోటనం
. ఉత్తరకాశీలోనే మరో మెరుపు వరద
ఉత్తరకాశి : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన వినాశకరమైన మేఘాల విస్ఫోటనం వల్ల తీవ్ర విధ్వంసం సంభవించింది. ఇక్కడి ధారాలి గ్రామంపై జల ప్రళయం విరుచుకుపడిరది. దీంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారం. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ వరదల్లో దాదాపు 10 మంది సైనికులు గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆర్మీ బేస్ క్యాంప్ ఉన్న హర్షిల్ దిగువ ప్రాంతంలో వీరంతా వరదలో కొట్టుకుపోయినట్లు సమాచారం. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్‌గఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించాయి. ఈ సంఘటన మొత్తం ధారాలి బజార్ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. ఇది గంగోత్రి ధామ్‌కు వెళ్లే మార్గంలో కీలకమైన ప్రదేశం. ప్రాథమిక నివేదికల ప్రకారం, ధారాలి గ్రామంపై మేఘాల విస్ఫోటనం సంభవించింది, దీని ఫలితంగా ఖీర్ గంగా నది నుంచి అకస్మాత్తుగా భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా నది ఒడ్డున ఉన్న అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక హోటళ్లు, హోమ్ స్టేలు కూడా దెబ్బతిన్నాయి. చాలా మంది కార్మికులు, నివాసితులు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు భయపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి సమీప గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఓ వైపు తమ బృంద సభ్యుల ఆచూకీ దొరకనప్పటికీ… సైన్యం మాత్రం అకుంఠిత దీక్షతో సహాయ చర్యలు కొనసాగిస్తోంది. సమాచారం తెలుసుకున్న 10 నిమిషాల వ్యవధిలోనే సైన్యం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు ‘ఎక్స్’ లో పేర్కొంది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపింది. వారందర్నీ హర్షిల్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇదిలాఉండగా, శిథిలాల కింద దాదాపు 10 నుంచి 12 మంది సమాధి అయి ఉండవచ్చని గ్రామస్తుడు రాజేష్ పన్వర్ పీటీఐకి తెలిపారు. 20-25 హోటళ్లు, హోమ్‌స్టేలు కొట్టుకుపోయి ఉండవచ్చని కూడా ఆయన అన్నారు. బార్కోట్ తహసీల్‌లోని బనాలా పట్టి ప్రాంతంలో పొంగిపొర్లుతున్న కుడ్ గధేరా వాగులో దాదాపు 18 మేకలు కొట్టుకుపోయాయి. పెరుగుతున్న వరద నీటి నుంచి తప్పించుకోవడానికి నివాసితులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తడంతో గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ధారాలి ఘటన జరిగిన కొద్దిసేపటికే ఉత్తరకాశీలోని సుఖీ టోప్‌లోనూ మెరుపు వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లగా… మరికొన్ని కొట్టుకుపోయాయి. మరోవైపు గంగోత్రికి వెళ్లే మార్గం భారీ వరదల కారణంగా కొట్టుపోయింది. దీంతో ఆ ప్రాంతంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. అదీకాక పర్వత ప్రాంతాలపై కురిసిన భారీ వర్షం వరదగా మారి జనవాసాలను ముంచెత్తాయి. దీంతో అనేక ఇళ్లు ఆ ప్రవాహా ధాటికి కొట్టుకుపోగా… భారీ వృక్షాలు సైతం నెలకూలాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులు కొట్టుకుపోవడం వల్ల ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరోవైపు, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఇక హరిద్వార్‌లోని గంగా, కాళీ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ధామీ
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడిరచారు. ఉత్తరకాశీ ప్రాంతంలోని ధారాలిలో కుండపోత వర్షాల వల్ల భారీ నష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరమన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికార బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నాయని తెలిపారు. బాధిత ప్రజలకు సాధ్యమైనంతగా అన్ని విధాలా సహాయం అందిస్తామన్నారు. మరోవైపు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం ధామీకి ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సమీపంలోని మూడు ఐటీబీపీ బృందాలను, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సంఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు. భారత సైన్యం ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది : ‘హర్సిల్ సమీపంలోని ఖీర్ గడ్ ప్రాంతంలోని ధారాలి గ్రామంలో భారీ బురదతో కూడిన వరద సంభవించింది. దీని వలన శిథిలాలు, నీరు అకస్మాత్తుగా ఇళ్ల గుండా ప్రవహించాయి’ అని తెలిపింది.
‘ఐబెక్స్ బ్రిగేడ్ దళాలను వెంటనే సమీకరించారు. సహాయక చర్యలను చేపట్టడానికి ప్రభావిత ప్రాంతానికి చేరుకున్నారు. నష్ట పరిధిని నిర్ధారించడం జరుగుతోంది. సహాయక చర్యలు ముగిసే కొద్దీ మరిన్ని నష్ట వివరాలు అందుతాయి. ఈ ప్రకృతి వైపరీత్యం సమయంలో మన పౌరులకు మద్దతుగా సైన్యం దృఢంగా నిలబడి ఉంది’ అని తెలిపింది.
ఈ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ : ఐఎండీ
మంగళవారం ఉదయమే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నైనిటాల్, హరిద్వార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన తుఫానులు, ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. చంపావత్, బాగేశ్వర్, పౌరి, తెహ్రీ, డెహ్రాడూన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చుశీఏసింది.


