న్యూదిల్లీ: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రాయేనని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్లు రేసులో ఉన్నప్పటికీ డివిలియర్స్ ఒక బౌలర్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ ఎంపిక వెనుక ఉన్న కారణాలను డివిలియర్స్ వివరిస్తూ… “కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, ఆఖరికి సూపర్ ఓవర్ అయినా సరే.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ గెలిపిస్తాడు. ఏ సమయంలోనైనా వికెట్లు తీయగల అతని నిలకడ అమోఘం” అని కొనియాడాడు. కానీ అతను నాకు బౌలింగ్ చేయనంత వరకు మాత్రమేనంటూ చమత్కరించారు. మరోవైపు, పాకిస్థాన్ సెలెక్టర్, మాజీ పేసర్ అకిబ్ జావేద్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. బుమ్రా బౌలింగ్ యాక్షన్ భిన్నంగా ఉండటం వల్లే బ్యాటర్లకు లయ దొరకదని చెబుతూ.. .బుమ్రాను మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చాడు. “ఫాస్ట్ బౌలింగ్‌లో బుమ్రా ఒక ఉస్మాన్ తారిఖ్ లాంటివాడు” అని ఆయన అనడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచ స్థాయి పేసర్‌ను ఒక సాధారణ స్పిన్నర్‌తో పోల్చడమేంటని నెటిజన్లు అకిబ్‌కు అక్షింతలు వేస్తున్నారు.


