విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. రెండు రోజుల క్రితం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు నివేదికను సిట్ అధికారులు అందించారు. ఇందులో ప్రధానంగా కేసు దర్యాప్తు పురోగతి, ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన విషయాలతో నివేదిక అందించినట్లు సమాచారం. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దర్యాప్తులో బయటపడిన అంశాలు, స్థానిక కోర్టు నుండి హైకోర్టు వరకు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటిపై జరుగుతున్న విచారణ, వాటి పురోగతి తదితర అంశాలను నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు బెదిరింపులను కూడా నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019`2024 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై గత ఏడాది అక్టోబర్ 19న సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర ఆహార నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ అధికారులతో సుప్రీంకోర్టు సిట్‌ను నియమించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ, పోలీసులు, అధికారులు విచారణ చేపట్టారు. సిట్ అధికారులు ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. బొలేబాబా, ఏఆర్, వైష్ణవి డైరెక్టర్లు, ఉద్యోగులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న, ఉద్యోగులను ఇటీవల సిట్ ప్రశ్నించింది. కాగా, ఒక్క టీటీడీకే కాకుండా.. ఇతర దేవాలయాలకు కూడా నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. టీటీడీ నుంచే నిందితులు దాదాపు రూ.240 కోట్ల వరకు లబ్ధి పొందారని వార్తలు వినిపించాయి. నకిలీ నెయ్యి తయారీ, సరఫరాలో బోలేబాబా డెయిరీదే కీలక పాత్ర అని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుమల లడ్డూ వివాదంపైసుప్రీంకు సిట్ నివేదిక
- Advertisement -
RELATED ARTICLES


