పి.చంద్రనాయక్
కళలు సాహిత్య రంగాలు తరతరాలుగా సామాజిక చైతన్యానికి, మానవ వికాసానికి, విజ్ఞానానికి, వినోదానికి మానసిక ఉల్లాసానికి ఒత్తిడి నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతున్న ఒక గొప్ప సాధనం. అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులైన ప్రజలను ఉత్తేజపరచడానికి మనసును కదిలించటానికి సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగించడానికి కళలు ఎంతో దోహదపడుతున్నాయి. విభిన్న సంప్రదాయాలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్న మన దేశంలో ప్రపంచ దేశాల కళావేదికలపై కళారంగం ద్వారా సోదర భావాన్ని ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. మనుషులలో ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి కళలు ఎంతో అవసరం. మనిషిని మహోన్నతుడిగా తయారుచేయడానికి కళారంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతటి మహోన్నతమైన సాంస్కృతిక రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కళాకారులు అరుదుగా ఉంటారు కనుక వాళ్ల ఓట్లు తమకు పెద్దగా ప్రయోజనం కలగదని భావించిన పాల కులు కళారంగ్ఙాóవృద్ధికి ఆసక్తిని చూపించడం లేదు. దేశంలోనూ కళారంగ పరిస్థితి దౌర్భాగ్యంగా తయారయింది. రాష్ట్రంలో అలాగే ఉంది. ఎంతో అభివృద్ధి చెందామని సంకలు గుద్దుకుంటున్న ప్రస్తుత సమాజం కంటే గతంలోనే జానపద కళలు, పౌరాణికాలు, సాంప్రదాయ కళలు గ్రామాల్లో విలసిల్లాయి. గతంలో పాలకులు రాజకీయ పార్టీలు కళాకారులను ఉపయోగించుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి ప్రచారం చేయడానికి కళారంగాన్ని వాడుకున్నారు. నేడు తమ గొప్పలు చెప్పుకోవడానికి పత్రికల్లో, టీవీల్లో ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కళాకారులకు కళా ప్రదర్శనలు కరువైపోయాయి. ప్రభుత్వం ఆర్భాటంగా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఆ శాఖ ద్వారా కళారంగాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు కేటాయించటంగాని ఆ రంగ అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలన్న ఆసక్తి పాలకులకు లేకపోవడం ముఖ్యంగా సాంస్కృతిక శాఖకు లేకపోవడం శోచనీయం. మరో మాటలో చెప్పాలంటే ఈ రంగానికి ప్రత్యేకమైన శాఖ లేనప్పుడు సాంస్కృతిక రంగం కళా రంగానికి ప్రయోజనం జరిగిందని చెప్పవచ్చు. తరతరాలుగా కళారంగాన్ని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న అనేక కుటుంబాలకు కళాసమాజాలకు నేడు ఆదరణ కరువైంది. ప్రాచుర్యం కలిగిన బుర్రకథ వీధిబాగోతం, చిందుబాగోతం, తోలుబొమ్మలాటలు, తప్పెటగుళ్లు ,గంగిరెద్దులు, గురవయ్యలు, కోలాటం, చెక్కభజన, పండరి భజన వాయిద్య విభాగంలో డప్పుల డోలు… గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొమ్ము నృత్యం, కోయ నృత్యం కళ బృందాలు ఉన్నాయి. అలాగే పౌరాణిక సాంఘిక పద్య నాటకాలు కూచిపూడి లాంటి కళారూపాలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. గతంలో గ్రామాల్లో హార్మోనియం వాయించే కళాకారులు విస్తృతంగా ఉండేవారు. హార్మోనియం వాయించే కళాకారులు ఉంటే వారు పది మందిని పోగేసి పాటలు పద్యాలు నేర్పే ఆనవాయితీ ఉండేది. అద్భుతమైన ఆణిముత్యాల లాంటి కళాకారులను తయారుచేసిన నేపథ్యం మన గ్రామీణ ప్రాంత కళాకారులకు ఉంది. వీటికి ప్రభుత్వ ఆదరణ కరువైంది. వేదికలు దొరకడం లేదు. ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచక కూలినాలి పనుల కోసం వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గాయక నటులు ఆహార్యాన్ని అందించే కళాకారులు నమ్ముకున్న రంగంలో ఆదరణ లేక వారు కనుమరుగౌతున్నారు. తాము నమ్ముకున్న రంగాన్ని వదులుకోలేక అందులో కొనసాగలేక కుమిలిపోతున్నారు కళాకారులు. కళారంగాన్ని మరింత అభివృద్ధి చేసి కళాకారుల సంక్షేమాన్ని చూడవలసిన ప్రభుత్వాలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సాంస్కృతిక శాఖకు నిధులు లేవు. అక్కడ పని చేసే ఉద్యోగులకు జీతాలు మాత్రమే విడుదల చేస్తుంది ప్రభుత్వం. నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కొన్ని కళల్ని బతికిస్తూ కళాకారులు బతికేవారు. ఇప్పుడు అ పరిస్థితి లేదు. కళాకారుని ఆత్మ గౌరవానికి సంబంధించిన గుర్తింపు కార్డు కూడా కళాకారులకు ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది. ఏమిటని అధికారులను అడిగితే కార్డులు ముద్రించడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వారే ఆవేదన చెందుతున్నారు. మహా అయితే ఒక కార్డు ముద్రణకు 10 రూపాయలు ఖర్చు ఆమాత్రం కూడా వెచ్చించడానికి ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 3 లక్షల 33 వేల కోట్లు. పేరు గొప్ప ఊరు దిబ్బ. పోనీ మిగిలిన రంగాల్లో పురోగతి ఉందా అంటే అదీలేదు. గతంలో సాధారణ పెన్షన్ కంటే కళాకారులకు రెట్టింపు ఉండేది. ఇప్పుడు ఏకంగా కళాకారుల పెన్షన్ విధానాన్ని తీసి పారేశారు. ఇది చాలా అవమానకరమైన విషయం. కళా రంగానికి కళాకారులకు సంగీత సాహిత్య నాటక లలిత కళల అకాడమీల ఆశయాలు గొప్పగా ఉన్న ఆచరణం శూన్యం. ఈ అకాడమీల చైర్మన్ పదవులు అధికార పార్టీ నాయకులకు ఉపాధి కేంద్రాలుగా మారాయి తప్ప వీరి వలన ప్రభుత్వానికి అదనపు భారమే తప్ప కళారంగానికి కళాకారుల సంక్షేమానికి ఉపయోగం లేదు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని తాము కళాకారుల పక్షమని గొప్పలు చెప్పుకోవడం తప్ప. అక్కడక్కడ కొన్ని కళావేదికల మీద గొప్ప ఉపన్యాసాలు చెప్పడం తప్ప సాధించింది శూన్యం. ముఖ్యమంత్రిని కలిసి కళారంగ స్థితిగతులను వివరించి నిధులు రాబట్టా లన్న ఆలోచన వారికి లేదు. బతుకుతెరువుకు మరొక పని చేయడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి అనేక మంది కళాకారులు అల్లాడిపోతున్నారు. గత వైసీపీ¾ హయాంలోనైనా ఇప్పుడు టీడీపీ హయాంలోనైనా కళాకారులకు ఒరిగిందేమీ లేదు. ఆయా ప్రభుత్వాలలో కళాకారులతో ప్రచారాలు నిర్వహించుకొని తీరా వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఫెస్ట్(ఉత్సవాల) పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి కళారంగానికి ఘనకార్యం చేసినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రాచీన జానపద సాంప్రదాయ కళలు ఏమున్నాయి? వారికి ఏ రకమైన ఉపాధి కార్యక్రమాలు కల్పించాలి ? ఎంతమంది కళాకారులు ఉన్నారు ?అనే లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కళాకారులు జీవితాలు మారటం లేదు. రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో కళాకారులకు కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించి వారికి తగిన గౌరవ వేతనాన్ని ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వం ఆ చర్యకు పూనుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ రంగంపై దృష్టి పెట్టాలి. అందుకోసం పనిచేసే వ్యక్తులను సంస్థలను సంప్రదించాలి. తక్షణం బడ్జెట్లో ఏటా 500 కోట్లు కేటాయించి కళారంగాన్ని , కళాకారులను కాపాడు కోవాలి. కళాకారులకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ విధానాన్ని మళ్లీ కళాకారులకు పునరుద్ధరించి నెలకు 10 వేలు వృద్ధ కళాకారులకు చెల్లించాలి. నివాసం ఉండటానికి కనీసం రెండు సెంట్లు ఇంటి స్థలం కళాకారులకు ఇవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్ ఎలా ఉందో కళాకారులకు కూడా విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఈ రంగంలోకి రావడానికి యువ కళాకారులు ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. పక్క రాష్ట్రం తెలంగాణలో సారధి పేరుతో కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నైపుణ్యం కలిగిన కళాకారులను ఎంపిక చేసి కాపాడుకోవాలి. ప్రభుత్వం నాటక ఉత్సవాలను విస్తృతంగా నిర్వహించాలి. నంది నాటకోత్సవాలు క్రమం తప్పకుండా అన్ని విభాగాలకు విస్తరింపచేయాలి. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రివార్డులను తమ పార్టీ వారికి లేదా రికమండేషన్ ద్వారా వచ్చిన వారికి కాకుండా నైపుణ్యం ఉన్న వారికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులు జానపద కళాకారులకు ఇవ్వడంలో విస్మరిస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు పద్మ లాంటి ఉగాది కళా పురస్కారాలను ఇస్తే అసలైన నైపుణ్యం కలిగిన కళాకారులు ఏమైపోతారు. కళాకారుల ప్రదర్శనలు ఇవ్వడానికి కళాక్షేత్రాలు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. వాటిని నిర్మించాలి మండల కేంద్రాలలో ఓపెన్ థియేటర్‌ను నిర్మించాలి. బస్సు, రైళ్లల్లో ప్రయాణించడానికి చార్జీల్లో రాయితీలు కల్పించాలి. సాంస్కృతిక శాఖ టూరిజం చలనచిత్రాలు టీవీ నాటక రంగ అభివృద్ధి కార్పొరేషన్ ఎఫ్‌డిసి ద్వారా సాహిత్య కళారంగాలను అభివృద్ధిపరచుకోవడానికి ప్రత్యేకమైన క్యాలెండర్ ఏర్పాటుచేసి వాటిని అమలుచేసి అనేక కళారూపాలను కాపాడుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయ కళల్ని బతికించుకోవాలని గొప్పలు చెప్పకునే దాని కంటే నిధులు కేటాయించి ఆచరించడం చేయాలి. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు పెద్ద రోడ్లు వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు బంగారం మాత్రమే కాదు మనిషిని మనిషిగా జీవించటానికి కళారంగం దోహదపడుతుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ముఖ్యంగా పాలకులు. ఇప్పటికైనా కళారంగం మనుగడకు, వికాసానికి, వినోదానికి, చైతన్యానికి ప్రతీకగా ఉన్న సాంస్కృతిక రంగాన్ని సాహిత్య రంగాలను విస్తృతంగా ప్రోత్సహించాలి.
. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు


