విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సీపీఐ సీనియర్ నాయకులు బొప్పూడి స్టాలిన్ బాబు మరణం పట్ల సీపీఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ విచారం వ్యక్తం చేశారు. ‘నాకు రాజకీయ బాట చూపిన మార్గదర్శకులు స్టాలిన్ బాబు గుంటూరులో మన అందరినీ వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడని తెలిసి తీవ్ర విచారం చెందాను. ఇలాంటి సమయంలో నేనుండాల్సిన బంధం మాది. అయితే పిల్లలతో ఉండాలని అమెరికా వచ్చేశాను. ఈ నెల 11, 12 తేదీలలో స్టాలిన్ బాబుతో, మా అమ్మలాంటి మరుద్వతి వదినను కలిశాను’ అని నారాయణ గుర్తు చేశారు. తాను గుంటూరుకు చదువుకోవడానికి వచ్చిన సమయంలో అప్పటికే పేరొందిన విద్యార్థి నాయకుడిగా స్టాలిన్ బాబుతో పరిచయమైందని నారాయణ వివరించారు. అప్పటికి తనకు రాజకీయ నేపథ్యం లేదని... వ్యక్తిగతంగా ఆత్మీయత పెంచుకున్నామని తెలిపారు. క్రమంగా ఏఐఎస్‌ఎఫ్ బాధ్యతలు చేపట్టి... దాని కొనసాగింపుగా సీపీఐకి ఆకర్షితుడయ్యానన్నారు. ముడిసరుకుగా గుంటూరుకు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన నన్ను తయారైన వస్తువుగా (సీపీఐ కార్యకర్తగా) తయారు చేయడంలో స్టాలిన్ పాత్ర గొప్పదని తెలిపారు. అది రాజకీయాల వరకే పరిమితం కాకుండా ఆత్మీయ కుటుంబంగా మారిపోయామన్నారు. అలాంటి రాజకీయ జన్మనిచ్చిన స్టాలిన్ బాబు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ... మరుద్వతికి, వారి పిల్లలకు సానుభూతి వ్యక్తం చేశారు. అప్పలనాయుడు మరణం పట్ల నారాయణ సంతాపం గిరిజన భూపోరాట యోధుడు అప్పలనాయుడు మరణం పట్ల డాక్టర్ కె.నారాయణ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాడు లోకోతవలస గిరిజనుల అటవీ భూమి అన్యాక్రాంతమైందని, అదే సమయంలో పాలకొండలో సీపీఐ జిల్లా సమావేశంలో ఉన్న తనను అప్పలనాయుడు గిరిజనులను తీసుకొచ్చి కలిశారని గుర్తుచేశారు. మరుసటి రోజే, లోకోతవలస గ్రామానికి ఆనాటి జిల్లా కార్యదర్శి సుందర్ లాల్‌తో పాటు జిల్లా నాయకత్వం వెళ్లి అన్యాక్రాంతమైన భూమిని ఆక్రమించి గిరిజనులకు స్వాధీనం చేశామని వివరించారు. ఆ పోరాటం పదేళ్ల క్రితం జరిగిందని, అక్కడే గిరిజన కాలనీ నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అంతటి ఉద్యమానికి నాయకత్వం వహించిన అప్పలనాయుడు మరణం సీపీఐకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నందున అంత్యక్రియలకు హాజరుకాలేక పోతున్నట్లు తెలిపారు. స్టాలిన్‌బాబు మృతికి రామకృష్ణ సంతాపం సీపీఐ సీనియర్ నాయకులు బొప్పూడి స్టాలిన్ బాబు మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ సంతాపం తెలిపారు. విద్యార్థి, యువజన నేతగా ఉద్యమాలలో స్టాలిన్ బాబు కీలకపాత్ర పోషించారని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ, కార్యవర్గ సమావేశాలలో పాల్గొంటున్నందున, నేను ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని అన్నారు. స్టాలిన్ బాబు మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్టాలిన్ బాబుకు జోహార్లు: ఈశ్వరయ్య సీపీఐ సీనియర్ నాయకులు బొప్పూడి స్టాలిన్ బాబుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విప్లవ జోహార్లు అర్పించారు. విద్యార్థి, యువజన ఉద్యమాలలో స్టాలిన్ బాబు పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. స్టాలిన్ బాబు మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టాలిన్‌బాబు మృతికి సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్, రాష్ట్ర నాయకులు వై.చెంచయ్య, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రముఖ సినీ గేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్, సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి.చెన్నకేశవరావు, పార్టీ రాష్ట్ర, జిల్లాల నాయకులు సంతాపం తెలిపారు. స్టాలిన్ బాబు మృతి విచారకరం : ముప్పాళ్ల నాగేశ్వరరావు విశాలాంధ్రగుంటూరు కలెక్టరేట్ : సీపీఐ సీనియర్ నాయకులు స్టాలిన్ బాబు మృతి విచారకరమని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. గుంటూరు శ్యామలానగర్‌లోని వారి స్వగృహంలో ఉంచిన స్టాలిన్ బాబు భౌతికకాయాన్ని సీపీఐ నాయకులు శుక్రవారం రాత్రి సందర్శించి నివాళులర్పించారు. స్టాలిన్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మరణం పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకులు వల్లూరి తాండవ కృష్ణ నివాళులర్పించగా… సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు తదితరులు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు.
నాకు రాజకీయ మార్గదర్శకులు స్టాలిన్ బాబు: నారాయణ
- Advertisement -
RELATED ARTICLES


