26న కోరుకొండలో దళిత నిరసన సభ
— మాజీ ఎంపి జి.వి. హర్షకుమార్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; ఇటీవల గాడాలకు చెందిన పాముల శ్రీను అనే దళిత యువకుడిపై జరిగిన దాడి నేపధ్యంలో ఇంతవరకు పోలీసులు నలుగురు నిందితులను మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన ఐదుగురు నిందితులను ఇంతవరకు అరెస్టు చేయక పోవడం దళితులపై పోలీసులకున్న పక్షపాత ధోరణికి నిదర్శనమన్ని మాజీ ఎంపి జి.వి. హర్షకుమార్ విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది యువకులు గొడవ పడుతుండగా వీడియో తీయడానికి ప్రయత్నించాడన్న కారణంతో పాముల శ్రీనును విపరీతంగా దాడి చేసి చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. సాక్షాత్తు పోలీసుల సాక్షిగా కూడా శ్రీను మీద దాడి చేసినా , దాడి చేసిన నిందితులందరినీ ఇప్పటి వరకు అరెస్టు చేయక పోవడం పోలీసుల పక్ష పాత ధోరణికి నిదర్శనమన్నారు. ఎక్కడో కందుకూరులో ఒక అగ్రకుల యువకుడిని హత్య చేస్తే మొత్తం ప్రభుత్వమే కదలి వెళ్ళి బాధిత కుటుంబాన్ని ఓదార్చిందని, అలాంటపుడు దళితులపై ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎందుకు పక్షపాత ధోరణిని చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ప్రజలందరికీ తెలియ చేయడానికి , దళితుల జనం మీద దాడుల పట్ల నిరసనను తెలియ చేయడానికి ఈనెల 26వ తేదీన కోరుకొండలో దళిత నిరసన సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దయచేసి పోలీసులు తమ సభకు అంతరాయం కల్గించవద్దన్నారు. దళితులపై ఇలాంటి ఘటనలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద జరుగుతున్నాయని, అయినప్పటికీ దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వన్నంగా ఉందని, సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్ అయ్యిందన్నారు. అయినప్పటికీ ఇటు చంద్రబాబు నాయుడు మసిబూసి మారేడు కాయ చందంగా కథలు చెబుతున్నారన్నారు. అటు కేంద్రంలో మోడీ అరాచకాలకు అడ్డేలేదన్నారు. మోడీ చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. రాష్ట్రంలో గూగుల్ సెంటర్లు ఏర్పాటుకు చంద్రబాబు , లోకేష్ ఆరాటపడిపోతున్నారని, అదానీకి దారదత్తం చేయడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు గూగుల్ సెంటర్లను వ్యతిరేకించిన జగన్ కూడా నేడు గూగుల్ సెంటర్ల పై నోరు మెదపక ప్లేట్ మార్చారన్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ నడుస్తున్న ప్రభుత్వాలు దొందూ దొందేనని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేసినా ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని, 70,000 మంది రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. మరి మోడీ ఏం చేసారో చెప్పాలన్నారు.


