ఫైనల్ పోరులో చైనీస్ తైపీపై ఘనవిజయం
వరుసగా రెండోసారి కప్ కైవసం
ఢాకా: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ చిత్తుగా ఓడిరచి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ మహిళలజట్టు చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడిరచింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధ భాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజూ దేవి సూపర్ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా… సారథి రీతూ నేగి ట్యాకిల్‌కు యత్నించి గాయపడిరది. ఇక రెండో అర్ధభాగంలోనూ భారత్ జట్టు ప్రత్యర్థి జట్టునుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. చివరి ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్ తైపీని ఓడిరచి జగజ్జేతగా అవతరించింది. తద్వారా డిఫెండిరగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్… వరుసగా రెండోసారి ప్రపంచకప్ సొంతం చేసుకుని సత్తా చాటింది. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలిచింది, గ్రూప్-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్-‘బి’లో చైనీస్ తైపీ సైతం ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 33-21 పాయింట్ల తేడాతో ఓడిరచగా… మరో సెమీస్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్‌పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్ చేరగా భారత్- చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం 11 జట్లు `ఆసియా నుంచి భారత్, ఇరాన్, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, నేపాల్, థాయ్‌లాండ్ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్.. యూరోప్ నుంచి పోలాండ్, జర్మనీ పాల్గొన్నాయి. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా కూడా పాల్గొనాల్సి ఉండగా… టోర్నీ ప్రారంభానికి ముందు పోటీలనుంచి వైదొలిగింది.
భారత జట్టు: రీతూ నేగి (కెప్టెన్), పుష్ఫ రాణా (వైస్ కెప్టెన్), సొనాలి షింగాటే, పూజా నర్వాల్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ, పూజా కజ్లా, చంపా ఠాకూర్, రీతూ షోరేన్, రీతూ మిథర్వాల్, సంజూ దేవి, ధనలక్ష్మి, అనూ కుమారి.


