. ఎక్కడా, ఎవరిపైనా బలవంతం లేదు
. జీరో పావర్టీ 2029 నాటికి సాకారం
. ఆగస్టు 19 నుంచి అమలు
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని… ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుంచి పీ4 అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. ఆ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు. స్పందించే మనస్సు ఉంటే… పేదలను ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకు వస్తారు. డబ్బుతో పాటు సాయం చేసే వారు కూడా మార్గదర్శులే. బంగారు కుటుంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండిరగ్, చేయూత మాత్రమే. సీఎస్సార్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా పీ4 కార్యక్రమం చేపట్టాం. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోంది. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు. ఎవరినీ బలవంతం చేయొద్దు. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారు. ప్రజల మనస్సుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారు. నేను ఇలాంటివి పట్టించుకోను. కొందరికి ఆర్థిక వనరులు ఉన్నా పేదలను ఆదుకోవడానికి మనస్సు రాదు. కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని గుర్తించండి… పీ4 వేదిక ఉందని చెప్పండి. ఆర్థిక అసమానతలు మరింతగా తగ్గాలి. ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించండి అంటూ సీఎం మార్గనిర్దేశనం చేశారు.
ఉద్యమ స్ఫూర్తిగా పీ4
ఇప్పటి వరకు 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. 1,03,938 మంది మార్గదర్శులను గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించాం. 11 ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించాం. 31 శాతం మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 22 శాతం మంది వైద్య చికిత్సలకు సంబంధించి, 9 శాతం మంది తమ చిన్నచిన్న వ్యాపారాలను మరింత పెంచుకోవడానికి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటంతో పాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు మార్గదర్శులు ముందుకు వస్తున్నారు. అలాగే ఫండ్ ఏ నీడ్ అనే అంశాన్ని కూడా పీ4 కార్యక్రమంలో పెట్టాం. ప్రస్తుతం నేను కూడా మార్గదర్శిగా పేరు నమోదు చేయించుకుని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చునని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పీ4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక, ప్రణాళికా శాఖ అధికారులు పాల్గొన్నారు.


