Tuesday, July 15, 2025
Homeయోగా నిర్వహణలో రికార్డు సృష్టిస్తాం

యోగా నిర్వహణలో రికార్డు సృష్టిస్తాం

. సీఎం చంద్రబాబు
. ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రత ఏర్పాట్లపై డీజీపీ హరీశ్‌గుప్తా వివరించారు. ఆర్కే బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేదికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అధికారులకు అనేక సూచనలు చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, నేతలతో నోవాటెల్‌ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడూ ఇష్టపడే నగరం విశాఖపట్నం అని, ఇక్కడ ప్రశాంతత, సానుకూల వైఖరి, మంచికి సహకరించే మనస్తత్వం కలిగిన ప్రజలు ఉంటారన్నారు. హుద్‌హుద్‌ తుపాను వచ్చిన సమయంలో వారం రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉన్నాననీ గుర్తు చేశారు. సంయమనంతో సమిష్టిగా ఉండి విపత్తును ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చా నని, ప్రజలందరినీ సాధారణ స్థితికి తీసుకొచ్చేవరకు కొన్ని నియమాలు పాటించాలని కోరితే అంతా పాటించారన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో యోగా డేనే అత్యంత పెద్దది, గొప్పదనీ, ఆరోగ్య రంగంలో పెద్ద గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. ఈ నెల 20న మాక్‌ ఈవెంట్‌ నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం అని, విశాఖపట్నం యోగా డే డిక్లరేషన్‌ ప్రకటిస్తాం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయో డిక్లరేషన్‌ ద్వారా ప్రకటిస్తామన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ అనువైన ప్రదేశమని, మీరు చేయగలుగుతారని ప్రధాని మోదీ చెప్పగానే సంతోషంగా చేస్తామని చెప్పానన్నారు. యోగాను ప్రపంచమంతా జరుపుకునేలా ప్రధాని మోదీ కృషి చేశారు. 21వ తేదీన పౌరులు పాల్గొనేందుకు ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుందర నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయడం మన అదృష్టం. యోగా భవిష్యత్తులో అందరి జీవితంలో భాగం కావాలి. టెక్నాలజీ యుగంలో తీరికలేకుండా గడుపుతున్నాం. అందరిలో ఉండే ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం. రాష్ట్రంలో యోగాంధ్ర థీమ్‌తో నెలరోజులపాటు కార్యక్రమం చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నెల రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో యోగా నిర్వహిస్తామని… 2 కోట్లమంది యోగా డేలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 2.17 కోట్లమంది పాల్గొంటామని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తాం. గిన్నిస్‌ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం తప్పకుండా సాధిస్తాం అని చంద్రబాబు అన్నారు. ‘బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ ఏపీ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాం. 6 నెలల్లో చిత్తూరు, రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిర్వహిస్తాం. ఏపీని ఆరోగ్యాంధ్రగా మార్చుతా. హెల్తీ, వెల్తీ హ్యాపీ రాష్ట్రంగా మార్చుతాం. కలుషిత ఆలోచన చేస్తే కలుషిత ఫలితాలే వస్తాయి…స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన పలితాలు వస్తాయి. ఇది మీడియా, సోషల్‌ మీడియా, రాజకీయ నాయకులు, సమాజంలో అన్ని వర్గాలకు వర్తిస్తుంది. కొందరు కలుషిత ఆలోచన చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారిని సమాజానికి దూరం పెడితేనే బాగుంటాం. లేదంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నోవాటెల్‌లో జరిగిన సమీక్షలో మంత్రులు, సీఎస్‌ విజయనంద్‌, డీజీపీతో పాటు ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు