Monday, November 17, 2025
Homeసాహిత్యంరాబోయే తరాల వెలుగు `ఈ తెలుగు కథకుల సాహితీ జిలుగు

రాబోయే తరాల వెలుగు `ఈ తెలుగు కథకుల సాహితీ జిలుగు

- Advertisement -

శైలజామిత్ర, 9290900879

తెలుగు కథా సాహిత్యం అనేది కేవలం పదాల సమాహారం కాదు. అది మన మనసుల లోతుల్లో అల్లుకున్న భావాల, అనుభవాల, విలువల ప్రతిబింబం. వీరు రచించిన ప్రతి రచన వెనుక, ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒకయుగం, ఒకసమాజం, ఒకతరం శ్వాసిస్తుంది. ముఖ్యంగా తెలుగు కథా సాహిత్యంలో భాష, శ్వాస అన్నీ అనుభవాల అద్దాలే. ప్రఖ్యాత కథారచయిత ఎమ్‌ఆర్వీ సత్యనారాయణమూర్తి గారు చేసిన పరిశోధన వంటి ఈ రచన ఎందరో మహానుభావుల సాహిత్య యాత్ర. ఇది ప్రతి తరానికి అందివ్వాల్సిన ఖనిజం. తెలుగు భాషలో కథకు ఎంతో ప్రాధాన్యత వుంది. మంచికథ కనిపిస్తే ఆలకించి వినే పాఠకులూ వున్నారు. అందుకే కాబోలు ఈ రచయిత ఇంతటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వీరు చేసిన ఈ పరిశోధనలో ఎందరో కథా ప్రముఖులు వున్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలుకొని పాలగుమ్మి పద్మరాజు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పోరంకి దక్షిణామూర్తి, పాలగుమ్మి పద్మరాజు, మాలతీచందూర్‌, మధురాంతకం రాజారాం, చాసో భరాగో, మునిపల్లెరాజు, బుచ్చి బాబు, కేతు విశ్వనాథరెడ్డి, దేవరకొండ బాలగంగా ధర తిలక్‌, భానుమతీ రామకృష్ణ, మునిమాణిక్య నరసింహా రావు వంటి ప్రతిష్టాత్మకమైన కలాల గురించి చర్చ లేదా పరిశోధన అంటే నిజంగా ఇది చారిత్రక నిర్ణయమే. శ్రీపాద వారి కలం చాతుర్యానికి, పద్మరాజు అంతర్జాతీయ ఖ్యాతికి, సుబ్బరామయ్య మధ్యతరగతి మనసు వాసనకు ఈ వ్యాసాలు ఆత్మీయ నివాళులు. వీరు రచించిన కథల సన్నివేశాలు మన కళ్లముందు తిరిగేలా, పాత్రలు మనతో పక్కపక్కన నడిచేలా, సంఘటనలు మన హృదయాన్ని కదిలించేలా ఈ రచయిత వివరిస్తూవచ్చారు. ఈ వ్యాసాలు కేవలం సాహితీచరిత్రలు కావు. భాషపై మమకారం, పాఠకుని హృదయానికి చేరే ఆత్మీయత. చదువరులు ఈ పుటల్లోకి అడుగుపెట్టినపుడు, కథల మాధుర్యాన్ని మాత్రమే కాక, వాటి వెనుక దాగిన కాలపువాసన, మానవత్వపు తాకిడి, సమాజపు చలనం కూడా అనుభూతి చేస్తారు. ఈ ప్రయత్నం తెలుగు కథాసాహిత్యం పట్ల ఈ రచయితకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని, కృతజ్ఞతను తెలుపడమే కాకుండా సమకాలీన పాఠకుడి హృదయంలో కొత్త వెలుగులు వెలిగిస్తాయనడంలో సందేహం లేదు.
అలాగే ఈ సంకలనంలో కథాప్రసిద్ధులు శ్రీ పోరంకి దక్షిణామూర్తి, మాలతీ చందూర్‌, మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, బుచ్చిబాబు వీరిలో ఒక్కొక్కరూ తమదైన పద్ధతిలో కథారచనకు పట్టంకట్టి తెలుగు భాషను సంపన్నం చేశారు. వారి రచనలు మనకు కేవలం కథలు, వ్యాసాలు, నవలలు మాత్రమే కాదు మానవ మనస్తత్వం, సామాజిక మార్పు, సాంస్కృతిక విలువలపై ఆలోచించేటట్లు చేసే అద్దాలవంటివి.
నిజానికి ఈ వ్యాసాలను పాఠకులకు అందించే ఈ రచయిత ఎమ్‌ఆర్వీ సత్యనారాయణమూర్తి కూడా చక్కని కథా రచయిత. కథా రచనలో వీరి శైలికి ఒక ప్రత్యేకత వుంది. తెలుగు సాహిత్యానికి నిరంతరం తమ వంతు సేవ చేస్తూ తెలుగు సాహితీ చరిత్రలో నిలిచిపోయే దిశగా వీరి ప్రయాణం సాగుతుందనేది నిర్విదాంశం. ఉదాహరణకు ఈ వ్యాసాలలో ప్రతి రచయిత గురించి చెప్పినప్పుడు, అది కేవలం బయోగ్రఫీ కాదని పాఠకుడు గ్రహించాలనే ప్రయత్నిస్తారు. ఇక్కడ వ్యక్తిగత పరిచయం, అనుభవాలు, ఆప్యాయతా క్షణాలు, సాహిత్యానుభవం ఇవన్నీ ఒకే గూటిలో కూర్చబడి ఉన్నాయి. అందుకే ఈ పుటలు చదివేటప్పుడు, మనం గ్రంథాలయంలో కూర్చుని పుస్తకాలను తిరగేస్తున్నట్టు కాదు వారి సన్నిధిలో కూర్చుని, వారుచెప్పే మాటలు వింటున్నట్టు అనిపిస్తుంది. అదే ఈ రచయిత ఘనత.
ఈ సంకలనం ద్వారా పాతతరానికి జీవాన్ని అందిస్తూ, కొత్తతరానికి దారిచూపేలా సాగింది. ఇది గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా స్పృశించే ఒక యాత్ర. తెలుగు సాహిత్యం అనేది వేల సంవత్సరాల పర్యవసానం. ఈ భాషలో రాసిన ప్రతిరచన, మన భౌతిక చరిత్రకంటే లోతైన ఒక సాంస్కృతిక వంశవృక్షానికి సాక్ష్యం. ఆ వృక్షానికి మూలాలు భక్తి, జ్ఞానం, అనుభవం, ఆత్మాన్వేషణలతో నిండి ఉన్నాయి.
ఇరవయ్యవ శతాబ్దం మధ్య నుంచి, తెలుగు సాహిత్యం నూతన దిశల్లో విస్తరించింది. సాంప్రదాయపు బాటలోనే కాక, ఆధునికత, సామాజిక చైతన్యం, వ్యక్తిగత అన్వేషణ లతో కొత్త అధ్యాయాలు రచించిన వారున్నారు. ఇలాంటి పరిణామంలో ముద్రవేసిన వ్యక్తులలో పోరంకి దక్షిణా మూర్తి, మాలతీ చందూర్‌, పాలగుమ్మి, బుచ్చిబాబు వంటి మహాకథకులు ప్రత్యేక స్థానం పొందారు. వీరి రచనలు కేవలం సాహిత్య కృతులు మాత్రమే కాక, సమాజపు అంతరంగాన్ని ప్రతిబింబించే చారిత్రక పత్రాలు. వారి పదాల వెనుక కాలానికి చెందిన తత్త్వం, ఆవేదన, ఆశ, తిరుగుబాటు అన్నీ కనిపిస్తాయి. ఈ సంకలనంలో ప్రతి రచయిత గురించి చెప్పిన సందర్భం, పాఠకుడికి కేవలం ‘‘ఎవరు’’ అనే సమాధానమే కాదు, ‘‘ఎందుకు’’ అనే లోతైన ప్రశ్నకు జవాబు కూడా ఇస్తుంది.
ఈ వ్యాసాలు సాహిత్య చరిత్రలోని ఒక స్వర్ణయుగానికి మానవీయ ముఖచిత్రాలు. వీటిని చదవడంఅనేది కాలంతో పాటు ప్రయాణం చేయడం లాంటిది. ఆ యుగపువాసన, మాటల మాధుర్యం, మనుషుల ఆప్యాయతను మళ్లీ అనుభవించడం. భవిష్యత్తు తరాలు ఈ వ్యక్తులను పుస్తకాల పుటలలో కాక, మనసులలో నిలుపుకునేలా చేయడమే ఈ గ్రంథకర్త ఉద్దేశ్యం.
నిజానికి తెలుగు సాహిత్యంలో కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమ గ్రామీణ జీవితం, మానవతా దృక్కోణం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిపత్యంపై విమర్శలతో ప్రసిద్ధి చెందారు. వీరి కథల్లో స్త్రీ ఆత్మగౌరవం, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తాయి. వీరి రచనలు అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. దేవరకొండ బాల గంగాధరతిలక్‌ పేదరికం, సామాజిక అసమానతలు, స్వార్థపరుల వాస్తవ రూపాన్ని చూపిన ఘాటైన కథకుడు. నల్లజర్ల రోడ్డు, దొంగ వంటి కథల్లో పేదల పట్ల సానుభూతి, అవినీతిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మునిమాణిక్యం నరసింహారావు హాస్యరచనలో ప్రత్యేక ముద్ర వేశారు. మధ్యతరగతి కుటుంబ జీవితం, భార్యాభర్తల అనుబంధం, చిన్న చిన్న సన్నివేశాల్లో హాస్యం, మమత కలిపిన కథలు రాశారు. కాంతం కథల్లో గృహ హాస్యానికి తోడు కరుణరసాన్ని పండిరచారు. కనుపర్తి వరలక్ష్మమ్మ జాతీయ చైతన్యం, సాంఘిక సంస్కరణలు, స్త్రీ సమస్యలను చర్చిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా కథలు రాశారు. సౌదామిని అనే కలం పేరుతో పత్రికలలో రచనలు చేస్తూ స్త్రీ చైతన్యాన్ని, కుటుంబ న్యాయాన్ని, సమాజపరమైన ఆలోచనలను ముందుకు తెచ్చారు.
తెలుగు కథాసాహిత్యం అనేది అనేక ముత్యాల సమాహారం. వాటిలో కొన్ని మాత్రమే కాలానుగుణంగా వెలుగొందుతుంటే, కొన్ని మాత్రం తరాలు మారినా పాఠకుల హృదయాల్లో అజరామరాలుగా నిలుస్తాయి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘‘రావిశాస్త్రి’’ అని అందరికీ తెలిసిన ఈ మహానుభావుడు అలాంటి అరుదైన కథా రచయితల్లో ఒకరు. వీరి కలం నుంచి వచ్చిన ప్రతి కథలోనూ కేవలం వినోదంకాదు, సమాజంలో అణగారిన వారి గాధ, బలహీనుల బాధ, అన్యాయానికి వ్యతిరేకంగా వినిపించే గళం, మనసును కదిలించే కరుణా రసం తళుకులు కనిపిస్తాయి. బడుగు, బలహీన వర్గాల వాస్తవ జీవనాన్ని, వారి భాషలోనే, వారిశైలిలోనే చెప్పిన కథకుడిగా ఆయన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ఈ వ్యాసం ద్వారా మనం రావిశాస్త్రి జీవిత ప్రయాణాన్ని, ఆయన రచనల వెనుక ఉన్న ఆత్మస్ఫూర్తిని, వీరు సృష్టించిన చిరస్మరణీయ కథలను మరోసారి గుర్తుచేసుకుంటాం. పుస్తకాల పుటల్లో మాత్రమే కాదు, పాఠకుల మనసుల్లోనూ ఆయన పాత్రలు ఇంకా జీవిస్తూనే ఉంటాయి.
చాసో (చాగంటి సోమయాజులు) అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో ఆచరణతో ముందుండి, తన కలంతో దిగువ వర్గాల నిజ జీవితాన్నే కథా వస్తువుగా మలిచిన మహ నీయుడు. గవిరి, చిన్నాజీ, ముసలమ్మ వంటి ఆయన పాత్రలు పాఠకుల మనసుల్లో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేసాయి. ఆయన కథల్లో మాండలిక భాష, సామాజిక చైతన్యం, కరుణా కలగలిపి, పాఠకుని మనసును ఒక్కసారిగా తాకుతాయి. భమిడిపాటి రామగోపాలం (భరాగో) మధ్యతరగతి జీవితంలోని చిన్నచిన్న సంఘటనలలోని మధురానుభూతులను, భర్త-భార్యల అనుబంధంలోని ఆప్యాయతలను, సహజమైన హాస్యాన్ని చక్కగా అల్లిన కథకుడు. మీకూ కథలే ఇష్టం వంటి కథలు మనసును నవ్వించడమే కాదు, మృదువుగా తడిపేస్తాయి కూడా.ఈ వ్యాసాల ద్వారా, ఉత్తరాంధ్ర సాహిత్య పంథాలోని ఈ మహనీయుల కృషి, వారసత్వం, కథల్లో దాగి ఉన్న సామాజిక, మానవతా విలువలను మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుంటాం.
తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయిన పేరు భానుమతి రామకృష్ణ. సినీరంగంలోనే కాదు, సంగీతం, రచన, దర్శకత్వం, హాస్యరచన వంటి అనేక రంగాలలో తన ముద్ర వేసి, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. ఆమె సృష్టించిన ‘‘అత్తగారు’’ పాత్ర తెలుగు పాఠకుల మనసుల్లో చిరునవ్వులు పూయించింది. సాధారణ కుటుంబ సంఘటనలను సున్నితంగా, హాస్య రసంతో మేళవించి, పాఠకుల ముందుకు తేవడంలో ఆమెకు సాటిలేదు. ఈ వ్యాసాల్లో భానుమతి అత్తగారి కథలు మనకు వినోదం మాత్రమే కాకుండా, మనుషుల స్వభావాలపై లోతైన పరిశీలన, జీవన విలువలపై చమత్కారమైన సూచనలు కూడా అందిస్తాయి.
గతం గ్రంథాలకే పరిమితం అయ్యిందని చాలామంది వారిని స్మరించడం లేదనే చెప్పాలి. ఈ కాలంలో మన ముందు తరం వారు వేసిన అడుగులు కూడా గమనించా లనేదే ఈ రచయిత వుద్దేశ్యం. ఒక రచయిత తన జీవిత కాలంలో గొప్పరచన చేయక మానరు. కానీ రచన చేయడమే కాదు. మనంచేసే పనిలో క్రమశిక్షణ, నిర్ధిష్టత, స్వచ్ఛత, వాస్తవం వంటి విలువైన ప్రకరణలు ఎంతలా నమ్మేవారో అనేది గ్రహించాలి. ఎందుకంటే రచన సమాజానికి సంబంధించినది. సమాజ శ్రేయస్సును నిత్యం కోరుకునేది. అలాంటప్పుడు మనం మన రచనల ద్వారా ఏమి చెబుతున్నామో దానిని ఒక రచయిత పాటించడం అవసరం కదా అనే విషయాన్ని తెలుసుకుని వుండాలి. అలా తెలపాలనేదే ఈ రచయిత ఎమ్‌ఆర్వీ సత్యనారాయణ మూర్తి మూల వుద్దేశ్యం. ఈ ప్రయత్నం రాబోయే తరాలకు ఎంతో ఉపయుక్తమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు