Tuesday, July 15, 2025
Homeరుణ ప్రణాళికలు కాగితాల్లోనే

రుణ ప్రణాళికలు కాగితాల్లోనే

. అన్నదాతల అగచాట్లు
. నిబంధనలతో విసిగిపోతున్న రైతన్నలు
. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం
. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం

విశాలాంధ్ర – సచివాలయం: రూపాయి లేనిదే కాడి సాగదు. ఆ రూపాయి కోసం అన్నదాతల అగచాట్లు అంతా ఇంతా కాదు. రైతులకు ఉదారంగా వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్న పాలకులు… ఇస్తున్నామన్న బ్యాంకర్లు మాటలకే పరిమిత మవుతున్నారు. ఒకవేళ ఏదైనా బ్యాంకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైనా వారి చుట్టూ రైతులు తిరగలేక విసిగిపోతుంటారు. బ్యాంకర్ల నిబంధనలతో రుణాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. నిర్ణీత గడువు ముగిసేసరికి రుణ ప్రణాళిక లక్ష్యాన్ని వందశాతం చేరుకున్నామని అధికారులు ప్రకటిస్తుంటారు. క్షేత్రస్థాయిలో చూస్తే బ్యాంకుల నుంచి రుణ లబ్దిపొందిన అసలైన రైతుల శాతం చాలా తక్కువగా ఉంటుంది. వార్షిక పద్దులో కౌలు రైతుల వాటా మరీ తీసికట్టుగా ఉంటోంది. రైతులు సీజన్‌ ఆరంభం నుంచి సాగు పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాగు వ్యయం పెరగడం మరోవైపు వడ్డీల భారం అధికమవడం చివరకు సరైన దిగుబడి లేక అప్పుల ఊబిలో అన్నదాతలు కూరుకుపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీసీఆర్సీలను రద్దు చేసి వాటి స్థానంలో కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని రూపకల్పన చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వెల్లడిరచినా కార్యాచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. సీసీఆర్సీ స్థానంలో కొత్త చట్టం పురుడు పోసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా కౌలు రైతులకు సీసీఆర్సీలను నామమాత్రంగానే ఇచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గత ప్రభుత్వంలో అత్యధిక మంది కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందలేదని కౌలు రైతు సంఘాలు చెబుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం సాగుదారుల హక్కు చట్టం అమలయ్యాక ఏపీ సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కమిషన్‌ రాష్ట్రంలో 24.25 లక్షల మంది కౌలు రైతులున్నట్టు గుర్తించింది. వీరిలో 6.19 లక్షల మందికి అసలు భూమి లేదని, 18.03 లక్షల మందికి కొంత సొంత భూమి ఉండి మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్టు గుర్తించింది. రాష్ట్రంలో 60.73 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో 27.15 లక్షల హెక్టార్లు అంటే 44 శాతం వ్యవసాయ విస్తీర్ణంలో కౌలు రైతులు సాగు చేస్తున్నట్టు వెల్లడిరచింది. రైతు సంఘాలు మాత్రం రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది కౌలు రైతులున్నారనీ, వారిలో 10శాతం మందికి కూడా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందటం లేదని చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 75 శాతం కౌలు రైతులు ఉన్నట్టు గతంలో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ప్రకటించాయి. సాగు వ్యయం భారీగా పెరగటంతో పాటు భూమి యజమానికి లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలు చెల్లించాల్సి రావటం, వడ్డీలేని పంట రుణాలు, రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం తదితర పథకాల లబ్దిదారుల జాబితాలో కౌలు రైతులు లేకుండా పోవటం అనివార్యంగా ప్రయివేట్‌ వ్యక్తులవద్ద నుంచి అధికవడ్డీకి నగదు తీసుకుని సాగు చేయాల్సిన పరిస్థితులు కౌలు రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని కౌలు రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయోత్పత్తిలో ప్రధాన మానవ వనరుగా ఉన్న కౌలు రైతులకు… భూ యజమాని సాగుదారులతో సమానంగా రుణాలు అందేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టంలోని మార్గదర్శకాలు ఉదారంగా ఉండేలా చూడాలని కోరుతున్న రైతు సంఘాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వేల కోట్ల పద్దుతో రుణ ప్రణాళికను బ్యాంకు వర్గాలు ప్రకటిస్తాయి. అందులో సింహభాగం సేద్యానికే చూపెడతారు. ఇదంతా కూడా పేవర్లలో కనిపించే గణాంకాలు, వాస్తవానికి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం అంత తేలికైన విషయంగా కాదు. పెట్టుబడి ఖర్చుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి వాటినే తీర్చే దారి కానరాక బలవంతంగా ఉసురు తీసుకుంటున్న రైతుల సంఖ్య నానాటికీ కలవరపెడుతోంది. కౌలు రైతులకు విరివిగా రుణాలు అందిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. గతంలో కేవలం వడ్డీ కట్టించుకుని రుణాన్ని అధికారులు పునరుద్ధరించేవారు. కానీ ప్రస్తుతం దానికి కూడా అసలు, వడ్డీ చెల్లిస్తేనే తిరిగి రుణం మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో అన్నదాతలు తాత్కాలిక సర్దుబాటు కొరకు అధిక వడ్డీకి అప్పు తెచ్చి బ్యాంకుల్లో కట్టి మళ్లీ రుణాన్ని పునరుద్ధరించుకుంటున్నారు. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెరగకపోవడం అన్నదాతలకు శాపంగా మారుతోంది. చాలీచాలని రుణం అందుతున్న కొంతమంది రైతులు మిగిలిన పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. సేద్యం కలిసిరానప్పుడు ప్రభుత్వం వడ్డీ విషయంలో మినహాయింపు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు