Thursday, December 12, 2024
Home‘రుషికొండ’ మంటలు

‘రుషికొండ’ మంటలు

. శారదా పీఠం భూములు, మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై రగడ
. మంత్రులు`వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం
. గురుదక్షిణ కోసమే భూముల కేటాయింపు: అచ్చెన్నాయుడు
. టీడీపీ హయాంలో భూములెలా ఇచ్చారు: బొత్స

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలిలో మంగళవారం కూడా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వాడీవేడిగా మాటల దాడి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ పర్యాటక కేంద్రం, మదనపల్లిలో భూ రికార్డుల దగ్ధం, శారదా పీఠానికి భూముల కేటాయింపు అంశాలపై మంత్రులు, వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో పరస్పర విమర్శలకు దిగారు. దీంతో మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎప్పటికప్పుడు చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు సర్దిచెప్పినప్పటికీ…ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. మదనపల్లెలో భూ రికార్డుల దగ్ధం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిస్తూ… ఈ కేసు విచారణ పురోగతిలో ఉందని, ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నామని, రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీజేశామన్నారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మదనపల్లెలో ఫ్రీ హోల్డ్‌ కింద ఎన్ని అసైన్డ్‌ భూములను గుర్తించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..గత వైసీపీ ప్రభుత్వ అవినీతి బయటకు వస్తుందన్న నెపంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులను ధ్వంసం చేశారని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ దందాలు ఎక్కడ బయటపడతాయోననే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో చైర్మన్‌ జోక్యం చేసుకుని పేర్లు లేకుండా మాట్లాడాలని మంత్రికి సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…రెవెన్యూ మంత్రి ఇచ్చే వివరణను వినకుండా వైసీపీ సభ్యులు నిరసనకు దిగి, గందరగోళం సృష్టించడం తగదన్నారు. మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… విచారించాకే..ఎవరైనా పేర్లు ఉంటే వెల్లడిరచాలని సూచించారు. అదే జరిగితే చంద్రబాబు పేరూ వస్తుందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, 2,443 ఫైళ్ల దగ్ధం అయ్యాయని, ఈ కేసులో ఎంతటివారున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమిలిలోని శారదా పీఠానికి భూముల కేటాయింపుపైనా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ప్రశ్నలపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బదులిచ్చారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసినట్లు తెలిపారు. సభ్యుడు రామారావు మాట్లాడుతూ… అడ్డగోలుగా అనేక అవకతవకలతో శారదా పీఠానికి భూములు కేటాయించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని రద్దు చేసిందన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి జగన్‌ గురు దక్షిణగా శారదా పీఠానికి భూములు ఇచ్చారని వ్యాఖ్యానించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 300 కోట్లు విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే ఇవ్వడం చాలా దారుణమని మంత్రి అనగాని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిబంధనలను అతిక్రమించి ఇచ్చారనే తాము గురుదక్షిణ అని అంటున్నామని ఎద్దేవా చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ధార్మిక సంస్థలకు భూములు కేటాయించడం ఆనవాయితీగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ కొన్ని సంస్థలకు భూములు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గురుదక్షిణ అనే పదం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మేం ఇవ్వకుంటే మీరు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజా సొమ్ము దుర్వినియోగం: పర్యాటక మంత్రి దుర్గేశ్‌
విశాఖపట్నంలోని రుషికొండ అంశంపైనా మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర విమర్శలకు దిగారు. పర్యాటక అంశంపై సభ్యుడు దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేశ్‌ ఘాటుగా సమాధానం ఇవ్వగా…వైసీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. నిర్మాణంతో రుషికొండ బీచ్‌కు ఆటంకం కలిగించారని, రిసార్ట్స్‌ నిర్మిస్తామని చెప్పి, ప్యాలెస్‌ను నిర్మించారని విమర్శించారు. వారు గదులు కడతామని చెప్పి, ఏడు బ్లాక్‌లుగా నిర్మించారని, అందులో ఉపయోగపడేదీ కేవలం మూడు బ్లాక్‌లేనని తెలిపారు. చివరగా దీనిని ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్‌ ఆఫీస్‌ అని, మంత్రుల కోసం అని ఉత్తర్వులు జారీజేశారని, వాటిని మండలిలో చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 58 గదులతో ఉన్న హరితా రిసార్ట్స్‌ను కూలగొట్టి, ఇంతకంటే మంచి రిసార్ట్స్‌ తీసుకొస్తామని అప్రూవుల్‌ తీసుకుని, ఆ తర్వాత రుషికొండలో ఖరీదైన ఏడు గదులతో నిర్మించారని వివరించారు. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగమైందని మంత్రి దుర్గేశ్‌ వ్యాఖ్యానించారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రుషికొండను వైసీపీ సభ్యులు చూస్తే ఇలా వారు కూడా మాట్లాడరని చెప్పారు. ఎస్‌ఎఫ్‌టీ రూ.6వేల తో కట్టిన శాసనసభ గురించి నాడు ఐదు రోజులపాటు వైసీపీ సభ్యులు గగ్గోలు పెట్టారని… అదే రుషికొండ నిర్మాణానికి ఎస్‌ఎఫ్‌టీకి రూ.28వేలు ఖర్చు చేశారన్నారు. కళ్లముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే..వైసీపీ సభ్యులు సిగ్గుపడాలన్నారు. దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2017లో నిర్మించినప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌టీ రూ.14వేలు(ఫర్నీచర్‌తో కలిపి) అని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు తప్పుడు అంకెలు చెబుతున్నారన్నారన్నారు. రుషికొండలోని నిర్మాణాలు ప్రభుత్వం పరంగా జరిగాయని, వాటిని ప్రభుత్వం వేటికైనా వినియోగించుకోవచ్చని చెప్పారు. అక్కడ అవినీతి జరిగితే దానిపై విచారించాలని కోరారు. మండలిలో ‘దమ్ముందా, సిగ్గుపడాలి, రండి చూసుకుందాం’ అనే మాటలను మంత్రి దుర్గేశ్‌ మాట్లాడటం తగదన్నారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ, దీనిపై చర్చకు రావాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు