. 2027 మార్చి1 కల్లా పూర్తి
. నోటిఫికేషన్ విడుదల
న్యూదిల్లీ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం విడుద లైంది. కేంద్ర హోం శాఖ ఈ గెజిట్‌ను విడుదల చేసింది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వదికాగా, స్వాతం త్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన ఇది. దీనికి సంబంధించి సోమ వారం కేంద్ర హోంశాఖ గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనతో పాటే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. మొత్తం రెండు దశల్లో జరగనున్న జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తి అవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జనగణనతో పాటు కుల గణననూ కూడా అదే సమయానికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జన గణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్‌లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లడ్డాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 సెప్టెంబరు ఆఖరు నాటికే జన గణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబరు 1ని రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది. జన గణన కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది.
ప్రభుత్వం వెల్లడిరచే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటు కూడా ఉంది. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుం టున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. జనాభా లెక్కల సన్నాహాలను సమీక్షించేందుకు జూన్ 15న దిల్లీలో జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేంద్ర హోం కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్, భారత్ జనాభా లెక్కల కమిషన్(ఆర్‌జీ, సీసీఐ), ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జూన్ 16న జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ సమావేశంలో అప్పుడే చెప్పారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు దశల్లో గణన జరగనుండగా… మొదటి దశ అంటే ఇంటి జాబితా ఆపరేషన్ (హెచ్‌ఎల్‌ఓ)లో ప్రతి ఇంటికి సంబంధించిన గృహనిర్మాణ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు. రెండవ దశ అయిన జనాభా గణన (పీఈ)లో… ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలతో పాటు వారి కులాల సమా చారాన్ని కూడా సేకరిస్తారు. 1931 తర్వాత తొలిసారిగా జన గణనలో కులాల వివరాలు కూడా సేకరించనున్నారు. ఈ ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 2021 జనాభా లెక్కలకు సంబంధించి 2020లోనే ఈ ప్రక్రియ చేపట్టాల్సింది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడిరది. ఈ క్రమంలోనే జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పూర్తి చేయడంతో కుల గణనకూ కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.