Homeసంపాదకీయంరైతుకు ఎల్‌నినో ముప్పు!

రైతుకు ఎల్‌నినో ముప్పు!

- Advertisement -

‘అసలు’ లేక అల్లాడిపోతుంటే..‘కొసరు’ అడిగినట్లుంది అన్నదాత పరిస్థితి. అమెరికా సహా వివిధ దేశాలతో మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతాంగం కనీవినీ ఎరుగని రీతిలో ప్రమాదం ఎదుర్కొంటున్న దశలో వాతావరణం కూడా మొహం చాటేయడం రైతును మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే దయనీయ పరిస్థితి దాపురించింది. నిజానికి మోదీట్రంప్ వాణిజ్య ఒప్పందానికీ, ఎల్‌నినోకు పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ప్రకృతి ప్రకోపించడం ఒకింత బాధాకరమే. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులు సకాలంలో వర్షాలు కురవక, కరువు ఛాయలు అలముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎల్‌నినో’ ప్రభావం ఈసారి పరాకాష్టకు చేరడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ వైపరీత్యం, నైరుతి రుతుపవనాల గమనాన్ని దెబ్బతీసి, వరüపాతాన్ని దారుణంగా పడిపోయేలా చేస్తోంది. ఫలితంగా ఈ సీజన్‌లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎల్‌నినో ప్రభావం రైతాంగంపై పిడుగులా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో కేవలం వర్షాలను తగ్గించడమే కాకుండా, భూగర్భ జలమట్టాలు పడిపోవడానికి కారణమవుతుంది. నదులు, జలాశయాలు, చెరువులలో నీటిమట్టం దారుణంగా క్షీణించడంతో తాగునీరు, సాగునీటి కొరత తీవ్రమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరిగి ఎండల తీవ్రత, వడగాల్పులు ఎక్కువవుతాయి. దీని ప్రత్యక్ష ప్రభావం దేశ ప్రాథమిక రంగమైన వ్యవసాయంపై పడుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, మార్కెట్‌లో ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇది కేవలం రైతాంగాన్నే కాక, దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్య ప్రజల జీవనాన్ని సైతం తీవ్రంగా దెబ్బతీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పండించే వరి, పత్తి, మిరప, వేరుశనగ, కందులు వంటి పంటలకు సకాలంలో నీరు అందకపోతే దిగుబడులు దారుణంగా పడిపోతాయి. విత్తనాలు మొలకెత్తే దశలోనే వర్షాలు లేక ఎండిపోవడం లేదా ఆలస్యంగా విత్తుకోవడం వల్ల పంట కాల పరిమితి తగ్గి చీడపీడల ఉధృతి పెరుగుతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల పంటల్లో తడి ఆరిపోయి, నాణ్యత దెబ్బతింటుంది. పాడి పంటలపై ఆధారపడిన రైతులకు పశుగ్రాసం కొరత పెను సవాలుగా మారుతుంది. నీటి ఎద్దడి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై వలసలు పెరిగే ప్రమాదం ఉంది.ఎల్‌నినో పరిస్థితి నుంచి రైతును బయటపడేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కేంద్రం వైపు చూస్తోంది. తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినోపై కాస్తయినా చర్చించడం ఒకింత ఊరట కలిగించే అంశమే. మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జాగుచేయక చర్యలు చేపట్టాలి. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం సాంప్రదాయ ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన తరుణమిది. పంటల బీమా, పరిహారాలపై కూడా దృష్టి పెట్టాలి. కరువు బారిన పడిన ప్రతి ఎకరానికి సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. ఉచిత లేదా రాయితీతో కూడిన పంటల బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతా క్రమంలో పంచాలి. తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూనే, మిగిలిన నీటిని ఆయకట్టు చివరి భూములకు తడులుగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి. ప్రత్యామ్నాయ లేదా స్వల్పకాలిక పంటల విత్తనాలను 80% నుండి 100% రాయితీపై రైతులకు వెంటనే పంపిణీ చేయాలి. పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన ఆలోచన నుంచి ప్రభుత్వం ఎందుకు దూరంగా వెళ్తుందో అర్థం కావడంలేదు. మండలాల వారీగా పశుగ్రాస బ్యాంకులను ఏర్పాటు చేసి, ఉచితంగా లేదా తక్కువ ధరలకు దానా, ఎండుగ్రాసాన్ని సరఫరా చేయాలి. అన్నదాతపై అనూహ్యమైన దెబ్బ పడినందున, రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన తక్షణావశ్యకత ఉంది. రైతులు తీసుకున్న సహకార, బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు, కొత్త రుణాలను సులభంగా అందించేలా బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ఈ తరుణంలో ఉపాధి హామీ పనుల విస్తరణ చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను పెంచి, వేతనాలను సకాలంలో చెల్లించాలి. కాకపోతే ఈ పథకం పేరు, తీరు మారినందున అది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియని సందిగ్థత పరిస్థితి నెలకొన్నది. అన్నింటికీ మించి ఇప్పటికిప్పుడు రైతులకు అందించాల్సిన మార్గదర్శకాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలి. తక్కువ నీటి పంటల సాగుపై దృష్టి పెట్టే దిశగా దిశానిర్దేశం చేయాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా ఆరుతడి పంటలైన ప్రొద్దుతిరుగుడు, జొన్నలు, సజ్జలు, మినుములు, పెసలు, వేరుశనగ వైపు రైతులను మళ్లించాలి.అలాగే బిందు, తుంపర సేద్యాన్నీ ఇలాంటప్పుడు కాదనలేం. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలి. వర్షాలు లేని సమయంలో పంటలను కాపాడుకోవడానికి పంప్సెట్ల ద్వారా లేదా ఫామ్పాండ్స్‌ (సాగునీటి కుంటలు)లోని నీటిని వినియోగించి రక్షక తడులు ఇవ్వాలి. భూమి తేమను కాపాడుకోవడం కోసం చర్యలు చేపట్టాలి. పొలంలో తేమ ఆవిరి కాకుండా ఉండటానికి చెత్తాచెదారంతో కప్పడం (మల్చింగ్) వంటి పద్ధతులను పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. ఇవన్నీ ఒకెత్తయితే, పంటల బీమాతో రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం తటపటాయించకూడదు. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేకపోవచ్చు, కానీ ముందస్తు ప్రణాళికలతో వాటి తీవ్రతను తప్పక తగ్గించవచ్చు. ఎల్‌నినో సృష్టిస్తున్న సంక్షోభం తాత్కాలికమైనది కాదు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సమగ్ర ‘కరువు నివారణ ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. రైతును ఆదుకోవడం అంటే సమాజ పునాదులను కాపాడుకోవడమేనని గ్రహించి, ప్రభుత్వాలు త్వరితగతిన అడుగులు వేయాల్సిన సమయమిది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు