Monday, March 16, 2026
Homeఅంతర్జాతీయంవాణిజ్య భాగస్వాముల ఎంపిక మా హక్కు

వాణిజ్య భాగస్వాముల ఎంపిక మా హక్కు

- Advertisement -

ట్రంప్‌కు రష్యా స్పష్టీకరణ
మాస్కో: తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై సుంకాలు పెంచుతామని బెదిరించినందుకు ట్రంప్‌పై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ తీవ్ర స్థాయిలో మండిపడిరది. భారతదేశంపై అమెరికా అక్రమ వాణిజ్య ఒత్తిడి కలిగిస్తోందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని అమెరికాకు స్పష్టం చేసింది. భారత్‌పై ట్రంప్‌ చేస్తున్న బెదిరింపులు అసమర్థమైనవని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ విమర్శించారు. ‘ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో మాతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం ఇతర దేశాలను బెదిరించడం మేం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి బెదిరింపులను చట్టబద్ధమైనవిగా పరిగణించం. ఎందుకంటే సార్వభౌమ దేశాలు వాణిజ్య, ఆర్థిక సహకారం కోసం సొంతంగా తమ వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కు కలిగి ఉంటాయని మేం విశ్వసిస్తున్నాం. అందుకు విరుద్ధంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరైన చర్య కాదు’ అని దిమిత్రీ పెస్కోవ్‌ అన్నారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్‌ పట్టించుకోవడం లేదని, అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మాటలపై ఇప్పటికే రష్యా స్పందిస్తూ అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని పేర్కొంది. తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని పాటిస్తోందని, తనను అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు.
అణుఒప్పందం అమలు చేయం
రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగా మారనుంది. మధ్యశ్రేణి క్షిపణులు మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్‌ (ఇంటర్మీడియట్‌ రేంజి న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పు సృష్టించాయని ఆరోపించింది. అందువల్ల ఆ ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కొన్నిరకాల క్షిపణులు మోహరించకుండా విధించుకొన్న ఆంక్షలను ఇక పాటించేది లేదని స్పష్టం చేసింది. అమెరికా దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్‌ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడిరచింది. మరోవైపు ట్రంప్‌ చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు