. స్మార్ట్‌మీటర్లు వద్దు: అదానీతో ఒప్పందాల రద్దు
. స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించడంతోపాటు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదానీతో జరిగిన అన్ని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలన్నారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వామపక్షాలు, ప్రజాసంఘాల ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. విద్యుత్ ట్రూ అప్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ, అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట మంగళవారం నిరసనలకు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కదిలి వచ్చిన వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజానీకానికి సీపీఐ రాష్ట్ర సమితి తరపున రామకృష్ణ అభినందనలు తెలిపారు. విద్యుత్ సంస్కరణలను, స్మార్ట్‌మీటర్ల బిగింపును వేగవంతం చేస్తూ మరో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆస్కారమిస్తున్నది. విద్యుత్ చార్జీల పెంపు తీవ్రమైన సమస్యగా ప్రజలను వేధిస్తోంది. దానికి తోడు పాలక వర్గాలు అదానీకి విద్యుత్ పంపిణీ సంస్థలను అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్ధం కావడం, స్మార్ట్‌మీటర్ల బిగింపు పేరుతో వినియోగదారుల నడ్డివిరిచేందుకు పావులు కదపడం దుర్మార్గం. గత వైసీపీ ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్లపాటు దాదాపు రూ.లక్షా పదివేల కోట్ల భారం పడుతుంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు… అదానీతో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలన్నీ అక్రమమైనవని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో అడుగు ముందుకేసి స్మార్ట్‌మీటర్లను పగలగొట్టమని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ‘ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా’ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.15,480 కోట్ల గుదిబండ ప్రజలపై మోపింది. అదానీ స్మార్ట్‌మీటర్ల బిగింపును వేగవంతం చేసింది. గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలపై నోరుమెదపలేదు. ఇప్పుడు మరో రూ.12,770 కోట్ల కరెంటు చార్జీల భారం మోపేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్‌మీటర్ల బిగింపునకు అయ్యే ఖర్చు సింగిల్ ఫేస్‌కు రూ.9 వేలు, త్రీ ఫేస్‌కు రూ.18 వేలు చొప్పున 93 నెలలలో వినియోగదారుల నుంచి నెలవారీగా విద్యుత్ బిల్లులలో పొందుపరచి వసూలు చేయనున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రానున్న కాలంలో ప్రజలు తాము వాడే కరెంటుపై డిమాండ్‌కు అనుగుణంగా పీక్ అవర్స్ డిమాండ్ పేరుతో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఎఎంఆర్) ఆధారంగా విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు, వినియోగదారులకు తెలియకుండానే రిమోట్ కంట్రోల్ ద్వారా పంపిణీని నియంత్రించడానికి అడ్వాన్స్‌డ్ మీటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎఎంఐ) పద్ధతులకు అవకాశమిస్తాయి. ముందుగా డబ్బు చెల్లించి రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా చేసే ప్రీపెయిడ్ విధానం తెచ్చేందుకు అదానీ కంపెనీతో కుమ్మక్కై స్మార్ట్‌బాంబును ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నది’ అని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరెంటు చార్జీలు, స్మార్ట్‌మీటర్లు, అక్రమ విద్యుత్ ఒప్పందాలపై మహోద్యమానికి సిద్ధం కావాలన్నారు. విద్యుత్ ఉద్యమం మరింత తీవ్రతరం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలని రామకృష్ణ హితవు పలికారు.


