ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గం
గా కూలంకష ! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్…
ఇది ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం. లోకసభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారం గమనిస్తే ఈ పద్యం గుర్తు రాక తప్పదు. మన పార్లమెంటు అనేక ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పింది. ఈ సంప్రదాయాలను, ఆనవాయితీలను తుంగలో తొక్కడం మోదీ ప్రధానమంత్రి అయిన 2014 నుంచి మొదలైంది. లోకసభ స్పీకర్లు అనేక మంది చరిత్ర సృష్టించారు. మొట్టమొదటి లోకసభ స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మౌలంకర్‌ది ఈ విషయంలో అద్వితీయమైన పాత్ర. 1946లో కేంద్ర అసెంబ్లీ (ప్రస్తుత పార్లమెంట్) మొదటి స్పీకర్‌గా ఆయన ఎన్నికయ్యారు. ఆయన స్పీకర్‌గా ఉన్న కాలం లోకసభది ఉజ్జ్వల చరిత్ర. నెహ్రూ ఆయనను లోకసభ పితామహుడు అనే వారు. ప్రస్తుతం పార్లమెంటులో అనుసరిస్తున్న ఉత్తమ సంప్రదాయాలు, ఆనవాయితీలు ఆయన రూపొందించినవే. సభా మర్యాదకు తాను కట్టుబడి ఉండడమే కాక ఇతరులు వాటిని పాటించేట్టు చూసేవారు. స్వాతంత్య్రం తరవాత పార్లమెంటు ఎలా ఉండాలో ఆయనే బాట వేశారు. వలసవాద దశ నుంచి స్వతంత్ర దేశంగా అవతరించిన తరవాత ఇప్పటిదాకా మన పార్లమెంటు పరిణామ క్రమంలో మౌలంకర్ పాత్ర మహత్తరమైంది. ప్రశ్నోత్తరాల సమయం, స్వల్ప వ్యవధి చర్చలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లాంటి పద్ధతులు ప్రవేశపెట్టింది ఆయనే. మౌలంకర్ హయాంలో పార్లమెంటు సమావేశాలు ఎక్కువ కాలం నిర్వహించేవారు. ఇప్పుడు సమావేశ కాలాన్ని ఎలా కుదించాలి అని అధికారపక్షం ప్రయత్నిస్తోంది. మౌలంకర్ ప్రవేశపెట్టిన ఉత్తమ సంప్రదాయాలకు చిన్న నిదర్శనం : ఒక సారి అప్పటి ప్రధానమంత్రి పండిత్ నెహ్రూ పార్లమెంటులో కూర్చుని “ఒకసారి నా గదికి రండి” అని చీటీ రాసి పంపారు. అప్పుడు మౌలంకర్ వెంటనే “స్పీకర్ ఎవరి గదికీ రారు” అని చీటీ రాసి పంపించారు. నెహ్రూ నాలుక కరుచుకుని తానే స్పీకర్ గదికి వెళ్లారు. మౌలంకర్ తరవాత స్పీకర్ అయిన అనంత శయనం అయ్యంగార్, నీలం సంజీవరెడ్డి, బలరాం ఝాకడ్ స్పీకర్లుగా ఎన్నికయ్యారు. గంటి మోహనచంద్ర బాలయోగి కూడా రెండుసార్లు స్పీకర్‌గా ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన వారు స్పీకర్ కావడం అదే మొదటిసారి. బాలయోగి స్వాతంత్య్రం తరవాత జన్మించిన వారు. ఆయన 47 ఏళ్లకే ఆ పదవిలోకి వచ్చారు. ఆ తరవాత మనోహర్ జోషీకి ఆ గౌరవం దక్కింది. కమ్యూనిస్టు పార్టీకి (సీపీఎం) నాయకుడు సోంనాథ్ చటర్జీ స్పీకర్ కావడం కూడా అపూర్వ ఘట్టమే. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే లోకసభకు, రాజ్యసభకు ప్రత్యేక టెలివిజన్ ఛానళ్లు ఏర్పడ్డాయి. సభా కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సోంనాథ్ చటర్జీ ప్రయత్న ఫలితమే. రాజ్యసభ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండవు. ఉప రాష్ట్రపతి స్థానంలో ఉండేవారు రాజ్యసభ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే వారూ అధికార పక్షానికి ఉన్న ఆధిక్యత ఆధారంగానే ఎన్నికవుతారు. అందువల్ల రాజ్యసభ అధ్యక్షులు సైతం అధికార పక్షానికి అనుకూలురు కావడం సహజమే. లోకసభ స్పీకర్‌ను లోకసభ సభ్యులు ఎన్నుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ ఉంటుంది కనక ఆ పక్షానికి సమ్మతమైన వ్యక్తే స్పీకర్ అవుతారు. రాజకీయ సమీకరణల కారణంగా తక్కువ మంది సభ్యులున్న పక్షం నాయకులు స్పీకర్‌గా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. బాలయోగి, సోంనాథ్ చటర్జీ అలా ఎన్నికైన వారే. బాలయోగి కానీ, సోంనాథ్ చటర్జీ కానీ తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ విషయంలో పక్షపాత వైఖరి ప్రదర్శించిన దాఖాలాలే లేవు. నీలం సంజీవరెడ్డి, సోంనాథ్ చటర్జీ స్పీకర్ పదవిలోకి వచ్చిన తరవాత తమ పార్టీలకు రాజీనామా చేసి వినూత్నమైన సంప్రదాయం సృష్టించారు. సంపూర్ణంగా నిష్పక్షపాతంగా ఉండడానికే వారు తమ పార్టీలకు రాజీనామా చేశారు. ఓం బిర్లా బీజేపీ నాయకుడైనందుకు అభ్యంతర పెట్టవలసిన అవసరం లేదు. ఆయన 2019 ఎన్నికల తరవాత, 2024 ఎన్నికల తరవాత లోకసభ స్పీకర్ అయ్యారు. చట్టసభల సభ్యుడిగా ఆయనకు సుదీర్ఘ అనుభవమే ఉంది. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఎవరైనా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందే. కానీ ఓంబిర్లా ఆ సూత్రాన్ని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ సభ్యులు ప్రధానమంత్రి మోదీ మీద దాడి చేసే అవకాశం ఉందని ఆయన భావించారట. అందుకని బుధవారం ప్రధానిని లోకసభకు రావొద్దన్నానని బిర్లా స్వయంగా చెప్పారు. ఈ అధికారం ఆయనకు ఎక్కడిదో అంతుపట్టదు. పైగా మోదీకి తనను తాను కాపాడుకునే సామర్థ్యం లేదని ఆయన ఎందుకు, ఎలా అనుకున్నారో! బిర్లా సలహా పాటించి లోకసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదించినప్పుడు ప్రధాని లోకసభకు హాజరుకాలేదు. గురువారం రాజ్యసభలో ధన్యవాదాల తీర్మానానికి సమాధానం చెప్పారు. పార్లమెంటు నిర్వహణ మౌలిక బాధ్యత అధికార పక్షానిది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన హక్కు ప్రతిపక్షానిది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి మాట్లాడే అవకాశం బిర్లా ఇవ్వకపోవడం అపూర్వమైన విషయం. ప్రభుత్వం మీద ఆయన ఈగ వాలనివ్వరు. ప్రతిపక్షాలు మోదీ పేరెత్తితే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ప్రధానమంత్రి మీద సభలో దాడి జరగొచ్చునని తనకు కచ్చితమైన సమాచారం ఉందని బిర్లా అంటున్నారు. పార్లమెంటులో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఈ మధ్య కేంద్ర పారిశ్రామిక రక్షణ దళాలను కూడా నియమించారు. మార్షల్స్ ఎటూ ఉంటారు. అత్యవసరమైనప్పుడు భద్రతా దళాలను సభలోకి పిలిపించే అధికారమూ స్పీకర్‌కు ఉంటుంది. బిర్లా హయాంలోనే ప్రతిపక్షాలు లేకుండా కీలక బిల్లులు ఆమోదించారుగదా ! ఒక వేళ ప్రధాని సభలో ఉంటే అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చునన్న కచ్చితమైన సమాచారం ఉంటే ఓం బిర్లా ఎఫ్.ఐ.ఆర్. ఎందుకు నమోదు చేయించలేదు. కాంగ్రెస్ సభ్యులను సభనుంచి సస్పెండు చేసే అధికారం కూడా ఆయనకు ఉంది కదా! నిష్పాక్షికంగా వ్యవహరించవలసిన బాధ్యతను ఆయన విడనాడి చాలా కాలమైంది. బిర్లా మోదీని సభకు రావొద్దని కోరడం ప్రభుత్వాన్ని జవాబుదారీతనం నుంచి తప్పించడమే. సభలో నిబంధనలు పాటించని సభ్యులు– వారు అధికారపక్ష సభ్యులైనా, ప్రతిపక్షం వారైనా వారిని దారిలో పెట్టడానికి స్పీకర్‌కు విస్తారమైన అధికారాలు ఉన్నాయి. బిర్లా వైఖరి కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పెడదారి పట్టించడమే.


