Wednesday, February 18, 2026
Homeసాహిత్యంహాస్యభరితం రాజుగారి కథలు

హాస్యభరితం రాజుగారి కథలు

- Advertisement -

డాక్టర్‌ బ్రహ్మానంద రెడ్డి,
9885641869

కథలు అందరూ అల్లుతారు. కొందరి అల్లికలో అందం కనిపిస్తుంది. మరికొందరి అల్లికలో మనసు ఆనంద డోలికల్లో ఊగిపోతుంది. అందం, ఆనందం రెండూ కొందరి కథల్లో కనిపిస్తాయి. అలాంటి కథల అల్లిక నేతగాడే ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు. ఇతని కథల్లో ఇంతవరకూ అక్కడక్కడ హాస్యపు ఛాయలు కనిపించాయి. ‘మీది తెనాలి మాది తెనాలి’ కథాసంపుటిలో పూర్తిగా హాస్యాన్ని పండిరచాడు. హాస్యాన్ని రచనలో చూపించాలన్నా, సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూపించాలన్నా చాలా కష్టం. హాస్య సన్నివేశాలను రాసేటప్పుడు రచయితలో చాలా ఓర్పు, నేర్పు ఉండాలి. సహజంగా హాస్యకథలను రాసేటప్పుడు ఆయా సన్నివేశాల్లో వేరే వారి మీద సెటైర్లు వేయడం పరిపాటిగా కనిపిస్తుంటుంది. అవతలి వారిమీద మన సెటైర్‌ ఎంత బాగా పేలితే అంత హాస్యం పండుతుంది. అవతలి వారి అంగవైకల్యం మీదనో, లేదా ఇంకో రకం శరీరం మీదనో జోక్‌లు వేయడం వల్ల కూడా హాస్యం పుడుతుంది. చాలా మంది విమర్శకులు ఇలాంటి హాస్యం సరైనది కాదని చెప్తారు.
ముఖ్యంగా హాస్యం 5 లక్షణాలను కలిగిఉంటుంది.

  1. అసహజత్వము 2. ఆశ్చర్యము 3.సందర్భశుద్ధి లేక పోవడం 4. అప్రియమును ప్రియముగామలచుట 5. అతిశయోక్తి.
    అసహజత్వము: దీనినే వైపరీత్యము అని కూడ అంటారు. సహజంగా జరగవలసిన పని ఇంకోరకంగా జరిగితే అది అసహజత్వ హాస్యము. ‘మీది తెనాలి- మాది తెనాలి’ హాస్యపు కథలో కనిపిస్తుంది.
    ఆశ్చర్యము : మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా కానీ, భిన్నంగా కానీ జరిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ఆకస్మికంగా కలిగే అనుభూతి వల్ల కూడా హాస్యం పుడుతుంది. పై కథలోనే కుప్పిరెడ్డి పెట్టే గురకవల్ల నిద్రపోలేదని కూతురు తల్లికి ఫిర్యాదు చేస్తుంది. తల్లి, మీ తండ్రి పెట్టే గురకను భరిస్తూ ముప్ఫై ఏళ్ళుగా కాపురం చేస్తున్నా అంటుంది. ఇలా వీళ్ళు కీచులాడు కుంటుంటే నిద్రలేచిన కుక్కిరెడ్డి ‘‘మీ అమ్మాయి గురక వల్ల ప్రశాంతంగా నిద్ర పోలేక పోతున్నా. ఆ మందు లేవో మీ అమ్మాయికి ఇప్పించండి’’ అని అడగడంతో ఆకస్మికంగా నవ్వుల పూలు పూస్తాయి.
    సందర్భశుద్ధి లేకపోవడం: సందర్భానికి తగ్గట్టు కాకుండా ఏదో సమాధానం చెబితే ఆ సమాధానం నవ్వుకి కారణమవుతుంది. ‘చక్కెరక్కను కుక్క కరిసింది’ కథలో ఇలాంటి హాస్యం కనిపిస్తుంది. చక్కెరక్కకు ఒకరు బాగున్నారంటే కడుపులో మంట. ఈర్ష్య. కుక్క తోకను అవ్వ తొక్కడంతో అది కరుస్తుంది. తన మనవడికి ఈ విషయం చెప్తుంది. కుక్కను చంపడానికి బయలుదేరుతాడు. ఎక్కడెక్కడో వెతికినా కరిచిన కుక్క కనపడదు. తిరిగీతిరిగీ అలసిపోయాక చచ్చిపడున్న కుక్కను చూస్తాడు. ఆ కుక్కే చక్కెరక్కను కరిచింది. ఆ సమయంలో అతని నోటి నుంచి వెలువడిన మాటలు హాస్యాన్ని కలిగిస్తాయి. ‘‘కుక్క కరిస్తే మనిషి చచ్చిపోవడం విన్నాము. చూశాము. మనిషిని కరిచిన కుక్క చనిపోవడం విచిత్రంగా ఉందే’’ అనుకుంటూ ఇంటికి వెళ్ళడం.
    అప్రియమును ప్రియముగా మలచుట: కష్టం కలిగించే విషయాలను మెత్తని మాటలతో చెప్పటం వల్ల కూడా హాస్యం జనిస్తుంది. ‘దానవీరశూర కర్ణ’ కథలో మనుమడు ‘‘అమ్మమ్మా!.. కండ్లు కనబడడం లేదే’’ అంటాడు. అందుకు ఆమె ‘‘ఓరి పిచ్చి ముఖమా! కండ్లు మూసుకుంటే ఎవరికైనా కండ్లు కనబడవురా..’’ అని బదులిస్తుంది.
    అతిశయోక్తి : ఈ హాస్యం అసత్యం మీద పురుడు పోసు కుంటుంది. పరమ సత్యము చెప్పినప్పుడు ఎవరికీ నవ్వురాదు. సంబంధం లేని విషయాన్ని, అతకని విషయాన్ని చెబితే అప్పుడు హాస్యం పండుతుంది. ‘ఛత్ర’పతి కథలో ఈ విషయం తెలుస్తుంది. హీరోకు గొడుగు పట్టిన వాడిని కూడ పెద్ద హీరోలాగా చూడడం ఎక్కువ అనిపిస్తుంది.
    ఈ హాస్య కథల్లో రచయిత తానే చెప్పుకున్నాడు. కొస మెరుపు కామెడీ కథలని. అంటే మొత్తం కథంతా హాస్యం లేకున్నా చర్నాకుతో కొడితే చురుక్కమనేలా చివర్లో హాస్యం కనిపిస్తుంది.
    పారాచూట్‌‘ కథను నడిపిన విధానం ప్రత్యేకం. మొదట్లో హాస్యంలేదు. ఇద్దరుపిల్లలు ఒకర్నొకరు తక్కువ చేసుకోవడం సరదాగాఉంటుంది. ‘పారాచూట్‌’ ను అడగడం కోసం విమానం నుంచి దూకే పారాచూట్‌ను అడగడం నవ్వు తెప్పిస్తుంది. చివర్లో అక్కమ్మత్త పారాచూట్‌ను ఎందుకు వాడుతుందో చెప్పడం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పారాచూట్‌ నుంచి నూనెను తీయడానికి ఆవిడ చేసిన ప్రయత్నం అప్రయత్నంగా నవ్వు తెప్పిస్తుంది.
    రాజుగారి కథలు చదువుతున్నప్పుడు హాస్యం జనించడం తక్కువ. ఆ సన్నివేశాల్ని మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటే మనకు తెలియకుండానే నవ్వు కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇతని కథల్లో పాత్రలకు నాటక గుణముందనిపిస్తుంది. ఎందుకంటే దృశ్యకథలా ఊహించుకుంటే ఆ పాత్రలమధ్య జరిగిన సంఘటనలు కానీ, సంభాషణలు కానీ విపరీతంగా హాస్యాన్ని కలిగిస్తాయి. బహుశా రచయిత నాటకరచనలోకి పరకాయప్రవేశం చేస్తారేమో…! కథ రాసే సందర్భాల్లో. ఇందులో ఇరవై కథలుంటే అన్నిట్లోనూ హాస్యానికి కొదువలేదు. కొన్ని ప్రత్యక్షంగా హాస్యాన్ని కలిగిస్తే, కొన్ని అర్ధమైన తర్వాత ఎక్కువసేపు నవ్వుకునేట్టు చేస్తాయి.
    ‘కొండలడ్డునవ్వింది’ కథలో ముసలావిడ చేసే పనులన్నీ, మాట్లాడే మాటలన్నీ చమత్కార పూరితంగా కనిపిస్తాయి. ఆవిడ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. ఇలాంటి వారే లోకంలో ఎక్కువ. గొప్పలకు చెప్పేదొకటి చేసేదొకటి. అన్ని పనులకూ దోష నివారణోపాయాన్ని కనిపెడతారు. అదే అందులో ఉన్న అసలు మర్మం. కథ నడిపిన విధానం చాలా గమ్మత్తుగా ఉండడమే కాదు హాస్యాన్ని కొండలడ్డులా రుచి చూపిస్తుంది.
    ‘ఫారిన్‌ రిటర్న్‌డ్‌’ కథ ద్వారా బిల్డప్‌ల కోసం చేసే పనుల్లోని అంతరార్థం చూస్తే కానీ కనిపించవు అనే విషయం తెలుస్తుంది.
    ‘తీపిజబ్బు’ కథలో ఆడవారి మనస్తత్వానికి సంబంధించిన విషయం తెలుస్తుంది. తన బరువును దాచి తక్కువ బరువును చూపే ఆస్పత్రికి వెళ్తారన్న సత్యం ఇందులో తెలుస్తుంది. ఈ కథలో కూడా సున్నిత హాస్యానికి కొదువ లేదు.
    అందరికి తెలిసిన మాటలతో సున్నితమైన హాస్యాన్ని వండి వార్చారు కృష్ణస్వామి రాజు. తన కథలకు జీవం పోస్తున్న పుత్తూరు యాసలోనే కథలున్నాయి. రచయితకి తన యాస మీద ఎంత ప్రేమో! మాండలిక పదాలతో మాట్లాడే పామరుడు నిజంగా నాగరికుడి కన్నా వందరెట్లు గొప్పవాడు. ఎందుకంటే తన యాసలో తన భాషను బతికించుకుంటాడు. తన భాషలో తన భావాన్ని వినియోగించుకుంటాడు. తన భావాలతో పదిమందికి ఆనందాన్ని కలిస్తుంటాడు. ఇంతకన్నా ఏం కావాలి ఎవరి జీవితానికైనా..!
    రాజు గారు మరిన్ని మంచి కథలు రాయాలని ఆకాంక్షిస్తూ..

మీది తెనాలి -మాది తెనాలి (కొసమెరుపు కామెడీ కథలు)
రచన. ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
వెల రూ. 140/- పేజీలు 160
ప్రతులకు: రచయిత, సెల్‌: 9393662821

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు