. కత్తులతో పాశవికంగా నరికి చంపిన రౌడీషీటర్
. మరో పాత్రికేయుడికి స్వల్ప గాయాలు
విశాలాంధ్ర – వి.కోట: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి. కోట రహమత్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వి.జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయపు నడకకు వెళ్లిన ఆయనను ఇద్దరు వ్యక్తులు కత్తులతో అతి పాశవికంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళితే … జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడిచే అలవాటు ఉంది. ప్రతిరోజు మాదిరిగానే ఉదయం వాకింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో ప్రజాశక్తి దినపత్రిక రిపోర్టర్ వి. సుబ్రహ్మణ్యం జత రావడంతో ఇద్దరూ కలసి పలమనేరు జాతీయ రహదారి వైపు నుంచి ధనుపురంలోని వీధిలోకి నడుసూత వెళ్తున్నారు. అప్పటికే కాపుకాచి ఉన్న తమీం, సుభహాన్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వచ్చి జగన్మోహన్ రెడ్డిపై కత్తితో విరుచుకుపడ్డాడు. వెంబడించి అతి దారుణంగా నరికి చంపేశారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో పాత్రికేయుడు సుబ్రహ్మణ్యంను నెట్టివేయడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సోమశేఖర్ రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రశాంత్ డూడికి సమాచారం అందించారు. ఎస్పీ … స్థానికులు, మృతుడి బంధువులతోనూ మాట్లాడి వివరాలను సేకరించారు. హంతకులను గుర్తించామని, తమీం నేరచరిత్ర కలిగిన రౌడీ షీటర్ గా పోలీస్ రికార్డులలో ఉన్నాడని, ఇటీవల రిమాండ్ నుంచి విడుదలైనట్టు తెలిసిందని ఎస్పీ చెప్పారు. హత్య ఎందుకు చేశాడు… గతంలో వీరి మధ్య వివాదాలు ఉన్నాయా లేక మరెవరైనా అతడి చేత హత్య చేయించారా అనే కోణంలో సీఐలతో ఐదు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ పేర్కొన్నారు. భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు తరలించినట్టు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు.
జర్నలిస్టు సంఘాల నిరసన
ప్రభుత్వాలు మారినా నేరాల సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారథిలా పనిచేస్తూ సమాజంలో కుళ్లును వెలికితీస్తున్న జర్నలిస్టులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. నేర చరితులను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న దానికి నిదర్శనమే ఈ హత్యలు. ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వల్లనే దారుణాలు పెరిగిపోతున్నాయని సామాన్యులు సైతం విమర్శలు ఎక్కుపెట్టడం వైఫల్యాలకు ఊతమిస్తోంది. కాగా, విలేకరి హత్యను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు తమ నిరసన వ్యక్తం చేశాయి.


