రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత
జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.9గా నమోదైంది. అయినప్పటికీ ఎలాంటి సునామీ ముప్పు లేదని ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, తూర్పు మలుకు ప్రావిన్స్‌లోని తువాలుకు పశ్చిమాన 177 కి.మీ దూరంలో 80 కి.మీ లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. పశ్చిమ ఇండోనేసియాలో సోమవారం మధ్యాహ్నం 12:49 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని ఫలితంగా తూర్పు ఇండోనేసియాలోని అనేక చిన్న పట్టణాల్లో ప్రకంపనలు సంభవించాయని ఇండోనేసియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 27 కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియా ‘ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అనే ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత క్రియాశీల భూకంప కేంద్రాల జోన్. ఇక్కడ భూమిలోని క్రస్టులో వివిధ ప్లేట్లు కలుస్తాయి. కనుక ఇవి ఒకదానికొకటి ఢీకొనేటప్పుడు లేదా దూరంగా జరిగినప్పుడు భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండోనేసియాలో 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం వచ్చింది. దీని తరువాత హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేసియాలోనే ఈ సునామీ ధాటికి దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లోనూ ఆ దేశంలోని వివిధ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించగా… ఆ తరువాత వచ్చిన సునామీ కారణంగా 2,200 మందికి పైగా మృతి చెందారు.
ఇండోనేసియాలో భారీ భూకంపం
- Advertisement -
RELATED ARTICLES


