కాళేశ్వరంపై సర్కార్ కక్ష: కేటీఆర్
విశాలాంధ్ర – హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో జూరాల ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిన 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్‌రెడ్డి ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న జూరాల ప్రాజెక్టుకు, నేడు మంజీరా బ్యారేజీకి ప్రమాదఘంటికలు మోగుతున్నాయని సామాజిక వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్‌ఓ) నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం పక్కనపెట్టడం క్షమించరాని నేరమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కి చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్‌వే లోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్‌ఓ నివేదిక గుర్తించినా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నిన్నటిదాకా ఎస్డీఎస్‌ఓ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీకి, మంజీరా బ్యారేజీ మరమ్మతులు చేపట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వానికే కాదు… దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొన్నారు. మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై చివరికి డ్యామ్ ను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో ఇకనైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డ, మంజీరా బ్యారేజీకి మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సామర్థ్యానికి మించి వరద పోటెత్తడం వల్ల మేడిగడ్డ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కుమ్మక్కై బీఆర్‌ఎస్ పై బురదజల్లాయని మండిపడ్డారు.