ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
- సామాన్యులపై మోయలేని ఆర్థికభారం
- విపరీతంగా పెరిగిన బియ్యం, ఉల్లి, పప్పులు, వంట నూనెల రేట్లు
- కిలో బియ్యం రూ.75 నుంచి రూ.100 వరకు విక్రయం
- ఇదే సాకుతో మిల్లర్లు, దళారుల అక్రమ నిల్వలు… కృత్రిమ కొరత
విశాలాంధ్ర- సచివాలయం : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఎగబాకుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకుబండిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కూర వండుదామంటే ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తుండగా, పొట్ట నింపుకుందామంటే బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు దళారులు, వ్యాపారుల అక్రమ నిల్వలు, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కలిసి పేదవాడి కంచంలోకి అడుగుపెట్టే ప్రతి గింజనూ భారంగా మారుస్తున్నాయి. కందిపప్పు నుంచి పామాయిల్ వరకు అన్ని సరుకుల ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో వేతన జీవులు, గృహిణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో కారణంగా రైతులు ధాన్యం సాగుకు అంతంత మాత్రంగానే ముందుకు వచ్చారు. కొద్దిపాటిగా సాగైన పొలాల్లోనూ కొత్త రకం చీడపీడలు ఆశించి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు నీటి ఎద్దడి, తీవ్ర విద్యుత్ కోతల కారణంగా మరో 20 శాతానికి పైగా పొలాలు ఎండిపోయి దిగుబడి పడిపోయింది. ఈ పరిణామాలన్నీ పంట దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న రోజుల్లో ధాన్యం కొరత ఏర్పడనుందనే అంచనాలతో మిల్లర్లు, వ్యాపారులు సన్న ధాన్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి నిల్వలు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో బియ్యం కిలో రూ.74 నుంచి రూ.85 వరకు పలుకుతోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే బియ్యం ధరలు మరిన్ని రికార్డులు సృష్టిస్తాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాక ఒకానొక దశలో బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ ఊరట ఎక్కువ కాలం నిలవలేదు.. బహిరంగ మార్కెట్‌లో ఫైన్ క్వాలిటీ బియ్యం ధరలు అగ్గిపిడుగులా ఉండటంతో ప్రజలు రేషన్ బియ్యాన్ని దళారులకు విక్రయించి దుకాణాల్లో ఫైన్ క్వాలిటీ బియ్యం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో లబ్ధిదారుల నుంచే దళారులు రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వాటిని పెద్ద దళారులకు విక్రయిస్తుండగా, వారు ఆ బియ్యాన్ని మిల్ల్లుో వేసి పాలిష్ పట్టి, తిరిగి బహిరంగ మార్కెట్‌లో ఏదో ఒక బ్రాండ్ పేరుతో కిలో రూ.50కి విక్రయిస్తూ కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. బయట దుకాణాల్లో కిలో సూపర్ఫైన్ బియ్యం రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిస్తుండగా, కొన్ని దుకాణాల్లో ‘సింగిల్ పోలిష్ బియ్యం’ పేరు చెప్పి కిలో వంద రూపాయలకు విక్రయిస్తుండడం గమనార్హం. ఫైన్ క్వాలిటీ బియ్యం ధరలు పెరగడంతో రేషన్ బియ్యానికి ఈ స్థాయిలో అక్రమ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు అసలు అదుపులోకి రావడం లేదు. గ్రేడ్-2 ఉల్లిపాయల సగటు ధర ప్రస్తుతం కిలో రూ.63.61 గా నమోదు కాగా, ఆగస్టులో ఇదే ధర రూ.43.20 గా ఉండేది. అంటే కేవలం నెల వ్యవధిలోనే కిలోకు రూ.20.41 పెరిగింది. అలాగే గ్రేడ్-2 ఉల్లి ధర కూడా తాజాగా కిలో రూ.55.73 గా ఉండగా, గత నెలలో రూ.36.58 గా, గత ఏడాది రూ.20.89 గా ఉండటం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో, చిన్న దుకాణాల్లో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో ఏకంగా రూ.75 నుంచి రూ.100కి సమీపించాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.40 చొప్పున లభించిన చక్కెర ఇప్పుడు ఏకంగా రూ.65 నుంచి రూ.70 దాటేసింది. మినపప్పు ధరలు రూ.150 మార్కును తాకాయి. నిత్యావసరాల శ్రేణిలో ప్రముఖంగా వాడే వెల్ల్లుి కిలో ఏకంగా రూ.250 పలకడంతో సామాన్యులు కొనే సాహసం కూడా చేయలేకపోతున్నారు.
మండుతున్న వంట నూనెలు… కందిపప్పు
వంట నూనె పామాయిల్ లీటరు ధర ప్రస్తుతం రూ.155.20 గా ఉండగా, గత నెలలో రూ.153.45 గా, గత ఏడాది రూ.131.13 గా ఉంది. అంటే ఏకంగా 24.07 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ రిఫైన్¦ ఆయిల్ లీటరు ధర రూ.181.50 నమోదు కాగా, గత నెల ధర రూ.179.22 తో పోలిస్తే, 1.27 శాతం, గత ఏడాదితో పోలిస్తే 32.07 శాతం అధికంగా ఉంది. ఇక వేరుశెనగ నూనె లీటరు ధర రూ.185.18 గా నమోదు కాగా, గత ఏడాది రూ.159.71 తో పోలిస్తే 25.47 శాతం పెరిగింది. మరోవైపు పప్పు ధాన్యాల్లో గ్రేడ్-1 కందిపప్పు కిలో ప్రస్తుతం రూ.135.41 గా ఉంది. గత ఏడాది రూ.116.04 గా ఉండగా, ఏడాది కాలంలో 19.37 శాతం పెరిగింది. గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ.124.28 గా నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే 18.55 శాతం పెరిగింది. ధాన్యపు నిల్వలపై కనీస నిఘా లేకపోవడం, నియంత్రణ లోపం, మిల్లర్లు, దళారుల సిండికేట్ వ్యవహారాల వల్ల బహిరంగ మార్కెట్‌లో ధరలు యథేచ్ఛగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరల భారంతో ప్రతి కుటుంబం నెలవారీ బడ్జెట్ తలకిందులైంది. ఇప్పటికయినా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే అక్రమ నిల్వదారులపై, దళారులపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రైతు బజార్లలో సబ్సిడీ ధరలకే నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


