. భారత ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా?
. అమెరికాకు భారత్ తలొగ్గడం శోచనీయం
. అదానీకి మేలు చేయడమే మోదీ ధ్యేయం
విశాలాంధ్ర-తిరుపతి : భారతదేశ ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు తాకట్టుపెట్టే చర్యలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. మంగళవారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాపై 29 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందని… వాటి నుంచి బయటపడేందుకు అధ్యక్షుడు ట్రంప్… ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యపరంగా షరతులు, ఆంక్షలు విధిస్తున్నారన్నారు. మరోవైపు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పేరిట విదేశీయులను దేశ బహిష్కరణ గావిస్తూ…పొరుగు దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినట్లు చెప్పారు. అలాంటి దుశ్చర్యలకు భారత ప్రభుత్వం మద్దతు పలకడం సబబుకాదన్నారు. ఎలన్ మస్క్ అమెరికాను కంట్రోల్ చేస్తుండగా.. భారత్ ను అదానీ కంట్రోల్ చేస్తున్నాడని, ఆయనకు బీజేపీ శాయశక్తులా సహకారమందిస్తోందని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో లంచం అందించినందుకు ఆదానీపై న్యూయార్క్ కోర్టు కేసు నమోదు చేయగా… మస్క్ తో మాట్లాడి అక్కడి ఇన్వెస్టిగేషన్ ఏజన్సీని రద్దు చేయించే దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అప్పట్లో కుదిరిన విద్యుత్ ఒప్పందంతో దాదాపు 20ఏళ్లపాటు రూ.2 లక్షల కోట్లు ఆదానీకి లాభం చేకూర్చడమే అవుతుందన్నారు. ఆ భారం ఆంధ్రప్రజల మీద పడనుందని అభిప్రాయపడ్డారు. చైనాతో సహా, యూరప్ దేశాలన్నీ అమెరికాపై తిరగబడి ఆంక్షలు విధిస్తుండగా… మోదీ మాత్రం మంత్రి పీయూష్ గోయల్‌ను కాళ్లబేరానికి పంపించడం, భారత ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టడమే అవుతుందని మండిపడ్డారు. ఇలాంటి కపట రాజకీయాలు చేస్తున్న బీజేపీని గత ఎన్నికల్లో 240 సీట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. దేశంలో చంద్రబాబు, నితీశ్ కుమార్ ఇద్దరూ స్వంత ప్రయోజనాల కోసం మోదీని కాపాడారన్నారు. దిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని నారాయణ స్పష్టం చేశారు. లిక్కర్ కేసును బ్లాక్ మెయిల్ కు బీజేపీ ఉపయోగించుకుందన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల వల్ల సమాఖ్య వ్యవస్థను నీరుకార్చడమే అవుతుందన్నారు. అంతటి దుర్మార్గపు పరిపాలనకు నితీశ్, చంద్రబాబు మద్దతు పలకడం శోచనీయమన్నారు. సపోర్ట్ చేసే వారు పక్కన.. వ్యతిరేకించే వారు జైల్లో అన్న స్లోగన్ తో కేంద్రం పాలన సాగిస్తోందని నారాయణ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మరుతాన్నా.. విధానాలు మారలేదని… కొత్తసీసా పాత సారా అన్నచందంగా ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు. భూ కుంభకోణాలు పెరిగిపోయాయని, తిరుపతిలోని చెరువులు, ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో హైడ్రా నాయకత్వాన ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడుతుంటే ఏపీలో మాత్రం యథేచ్ఛగా కుంభకోణాలు సాగుతున్నాయన్నారు. మద్యం పాలసీలోనూ అనేక సమస్యలున్నాయని, బైరాగిపట్టెడ కూడలి సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలలు, బ్యాంకులు, మహిళలు తిరుగుతున్న ప్రాంతంలో వైన్ షాప్ ను ఏర్పాటు చేశారన్నారు. వైన్ షాప్ ను మరోచోటుకి తరలించమంటే సీపీఐ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కలెక్టర్ ను కూడా తప్పదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నుంచి అదే వైన్ షాప్ వద్ద దీక్షకు దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ యువత పోరుపై విలేకరులు ప్రశ్నకు స్పందిస్తూ… చేయాల్సిన వన్నీ చేసి తిరిగి పోరు చేస్తానంటే ఎలా? జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని చట్టసభల్లో ప్రజల గొంతు వినిపించకపోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన హత్యలు, భూ కుంభకోణాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా… నోటి దురుసు ప్రదర్శించిన వారినే ఇబ్బంది పెట్టడంతో సరిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారి జోలికి వెళ్లలేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు పెట్టినా… నేరుగా ఆయనే ఏమైనా చేసుకోండంటున్నా ఏం చేయలేకపోయార నారాయణ అన్నారు. హత్యా రాజకీయాలు చేసిన వాటిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. టీడీపీ చిలక్కొట్టుడు వ్యవహారంతో బిజీగా ఉందని విమర్శించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ రెడ్డి, గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి పి.మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కే రాధాకృష్ణ జే విశ్వనాథ్, బీ నదియా తదితరులు పాల్గొన్నారు.