Homeమైక్రోసాఫ్ట్‌కు ఏఐ దెబ్బ

మైక్రోసాఫ్ట్‌కు ఏఐ దెబ్బ

- Advertisement -

గంటల్లోనే రూ.36 లక్షల కోట్ల ఆవిరి

న్యూదిల్లీ: ప్రముఖ టెక్‌దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్‌లో కొన్ని గంటల్లోనే భారీగా నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేరు విలువ ఒక దశలో 12 శాతం కుంగింది. దాంతో ఆ సంస్థ విలువలో 400 బిలియన్ డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.36 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గతేడాది జనవరిలో చైనాకు చెందిన డీప్‌ఫేక్ ఏఐ మోడల్ ప్రవేశంతో చిప్ తయారీ సంస్థ ఎన్విడియా 593 బిలియన్ డాలర్లు కోల్పోయింది. 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలు చవిచూడడం ఇదే తొలిసారి. 1986లో ఈ టెక్ సంస్థ ఐపీఓకు వచ్చిన తర్వాత ఈ స్థాయి నష్టాలు చూడటం చాలా తక్కువ. కృత్రిమ మేధపై కంపెనీ చేస్తున్న వ్యయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ, కొత్త సాంకేతికతపై చేస్తున్న ఖర్చులపై ఇప్పటికే భారీగా చర్చ నడుస్తోంది. గతేడాది పెట్టిన భారీ పెట్టుబడులకు ఏ మేరకు ప్రతిఫలాలు అందాయో తెలుసుకోవాలని వాటాదార్లు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఏఐ విభాగాలపై పెట్టుబడుల్లో 66 శాతం పెరుగుదల కనిపించింది. ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. కానీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అజ్యూర్ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఇది మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రాబోయే ఏడాది కాలంలో డేటా సెంటర్ల మీద గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. దానికోసం గూగుల్ తప్ప మిగతా కంపెనీలన్నీ రుణాల బాట పట్టనున్నాయి. ఏఐతో తమకు స్వర్ణయుగం వస్తుందనే ఆశతోనే అప్ప్పులు చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ సంస్థ రానున్న సంవత్సరాల్లో 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతోంది. అయితే 2030కి గానీ లాభాలు రావని ఇప్పటికే వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు