నిండుకుండల్లా కృష్ణా, గోదావరి
తుంగభద్ర, దవళేశ్వరం గేట్లు ఎత్తివేత
ప్రాజెక్టులకు జలకళ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/కర్నూలు : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరికి వరద పోటెత్తుతోంది. రెండు నదుల్లోనూ వరద ప్రవాహం పెరిగింది. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో కృష్ణమ్మ ఉరకలెత్తేది. ఈ ఏడాది జులై మొదటి వారంలోనే కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కర్నాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వివిధ సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.
అ కర్నాటకలోని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువ కావడంతో దిగువకు జలాలను విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సైతం క్రమంగా వరద పెరుగుతోంది.
అ తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 56 వేల క్యూసెక్కుల వరద జలాశయంలో చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు.
అ శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పొటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 68,169 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.31 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే కొద్దిరోజుల్లోనే గేట్లు ఎత్తి దిగువకు వరద విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 50వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో పదిరోజుల్లో రెండు ప్రాజెక్టులు ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చేరుకుంటాయి.
` పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. స్పిల్‌వే వద్ద నీటిమట్టం ఎగువన 27.230 మీటర్లు కాగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 1,13,436 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో భారీ వాహనాల రాకపోకల కోసం 902 కొండ సమీపంలో ఏర్పాటు చేసిన రహదారి నీట మునిగింది. ఇప్పటివరకు పోలవరం గూటాల గ్రామాల మధ్యలో కనిపించిన ఇసుక తిన్నెలు క్రమేపి నీట మునుగుతున్నాయి. దవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం 96 వేల క్యూసెక్కులకుపైగా ఉంది. దీంతో 97వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


