Homeవేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో మంటలు : 19 మంది సజీవ దహనం

వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో మంటలు : 19 మంది సజీవ దహనం

- Advertisement -

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

. బైక్‌ను ఢీకొనడంతో ఎగసిపడిన మంటలు
. ప్రమాదంలో బైక్‌ రైడర్‌ సైతం మృతి

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సులో హఠాత్తుగా మంటలు ఎగిసిపడటంతో గాఢ నిద్రలో ఉన్న 19 మంది సజీవదహనమయ్యారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌ నుండి బెంగళూరు వైపు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వా బస్సు హైదరాబాద్‌లో రాత్రి 9:30 గంటలకు బయలు దేరింది. 44వ జాతీయ రహదారిపై కర్నూలు దాటిన తరువాత ఉలిందకొండ సమీపంలో తెల్లవారు జామున రోడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని సుమారు 25 మీటర్లు లాక్కుపోయింది. బస్సు ఇంజనులో బైక్‌ ఇరుక్కుపోయి ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవదహనమయ్యారు. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి కిందకు దూకి సుమారు 27 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సులో సుమారు 17 మంది పెద్దలు, ఇరువురు చిన్న పిల్లలతో పాటు 19 మంది దుర్మరణం చెందారు. కాగా, బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు. బస్సులో రక్తం ముద్దలు తప్ప ఆనవాళ్లు కూడా మిగల్లేదు. చంటిపిల్లలను హత్తుకొని ఒక తల్లి దహనం అయినట్లు తెలిసింది. గాయాలపాలైన 9 మందిలో కొందరు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో, కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, పోలీసులు, అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు, బీహర్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఆరుగురు, కర్నాటకకు చెందిన ఇద్దరు ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ దంపతులతోపాటు కుమార్తె, కుమారుడు నలుగురూ కాలిబూడిదయ్యారు. కుటుంబ సభ్యులను కోల్పొయిన మరికొందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా శరీరాలు కాలిపోవడంతో రక్తపు ముద్దలను తీసి డీఎన్‌ఏ పరీక్షకు పంపినట్లు అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి, డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జేసీ నూరుల్‌కమర్‌, కమిషనర్‌ విశ్వనాధ్‌, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఘటపై ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదనపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదంలో సజీవదహనమైన వారి వివరాలను పరిశీలిస్తే…కర్నాటకకు చెందిన ఫీలోమెన్‌బేబీ (64), కిషోర్‌కుమార్‌ (41), తమిళనాడుకు చెందిన ప్రశాంత్‌ (32), యువన్‌శంకర్‌రాజ్‌ (22), తెలంగాణకు చెందిన ఆర్గా బంధోపాధ్యాయ (23), మేఘనాథ్‌ (25), చందన (23), సంధ్యారాణి (43), అనూష (22), గిరిరావు (48), బీహార్‌కు చెందిన అమరీత్‌కుమార్‌ (18), బాపట్లకు చెందిన ధాత్రి (27), రమేష్‌, అనూష దంపతులతోపాటు వారి కుమారుడు శషాంక్‌, కుమార్తె మమత, ఒడిశాకు చెందిన కె.దీపక్‌కుమార్‌ (24) ఉన్నారు. వివరాలు లేని మరో వ్యక్తి కాలిబూడిదైపోయారు. వీరితోపాటు బైక్‌ నడుపుతున్న కర్నూలు జిల్లా బి.తాండ్రపాడుకు చెందిన శివశంకర్‌ (24) మృతి చెందారు.
ఏపీ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర హోం మంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలం చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయ చర్యలు చేపట్టాలని, మృతదేహాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వ్యాస్‌ ఆడిటోరియంలో డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తాతో కలసి మంత్రి అనిత విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో 19 మంది సజీవదహనం ఘటన దురదృష్టకరమని, బైక్‌ స్పార్క్‌ వల్లనే మంటలు వ్యాపించి దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని, 27 మంది సురక్షితంగా బయటపడ్డారని, ప్రమాదంపై అన్ని కోణాల నుండి దర్యాప్తు చేపడతామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
ఘటనపై 16 ఫోరెన్సిక్‌ బృందాలు వేశామని, 13 బృందాలు డీఎన్‌ఏ, రెండు ప్రమాదం జరిగినపుడు వచ్చిన బ్లాస్టింగ్‌ సౌండ్‌పై, రెండు రసాయపరమైన విశ్లేషణకు సంబంధించిన బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, అదనపు డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం మృతదేహాలను ఆ కుటుంబాలకు అందచేస్తామన్నారు. ద్విచక్రవాహనం రోడ్డుపై పడి ఉండటం వలన వేగంగా వెళుతున్న బస్సు దానిని ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చిందని, దానిని గమనించాలని డ్రైవర్‌కు మరోడ్రైవర్‌ తెలియచేయడంతో ఆయన బస్సు దిగి గమనించి… ద్విచక్రవాహనం ఇంజన్‌లో ఇరుక్కుపోయిందని గుర్తించినట్లు చెప్పారు. ద్విచక్రవాహనం నుండి వచ్చిన స్పార్క్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. దీనిపై పోలీసుల, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులతో అత్యున్నతస్థాయి కమిటీ వేస్తామన్నారు. ఏపీకి చెందిన మృతుల కుంటుబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఎక్స్‌గ్రేషియా అందచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు