Homeసబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు

- Advertisement -

కీలక దస్త్రాల స్వాధీనం
పరారైన డాక్యుమెంట్‌ రైటర్లు!

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. 120 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు… అనుమానాస్పదంగా ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది కలవరపాటుకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలోని స్టోన్‌హౌస్‌ పేట, విశాఖ జిల్లాలోని మధురవాడ, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరుతో పాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి, విజయనగరం తదితర జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ యంత్రాంగం దాడులు నిర్వహించింది. బయట వ్యక్తులను అనుమతించకుండా కార్యాలయం గేట్లు మూసేశారు. కొనుగోలు దారులనూ విచారించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి విచ్చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రావడం చూసిన కొంత మంది సిబ్బంది.. తమ జేబుల్లో ఉన్న నగదును బయటకు విసిరేసినట్లు సమాచారం. నెల్లూరు స్టోన్‌హౌస్‌ పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి… కార్యాలయానికి తలుపులేసి వివిధ రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవులో ఉండటంతో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్‌ శాఖ సిబ్బందిని వ్యక్తిగతంగా పిలిచి… పూర్తిస్థాయిలో ఏసీబీ అధికారులు విచారించారు. విశాఖపట్నంలోనూ ఆకస్మిక సోదాలు జరిపారు. మధురవాడ, భోగాపురం, టర్నర్‌ చౌల్ట్రీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఏసీబీ అధికారులు వెళ్లారు. రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించి… సబ్‌ రిజిస్ట్రార్‌ సిబ్బంది, దస్తావేజుల విభాగంలో లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు. ఆళ్లగడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఏసీబీ అధికారులు రావడంతో డాక్యుమెంట్‌ రైటర్లు పరారయ్యారు. దీంతో అక్కడి కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలుమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో సబ్‌ రిజిస్ట్రార్‌పై భారీగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కార్యాలయం తలుపులు మూసివేసి మరీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఎక్కడికక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన చెందారు. ఇటీవల కాలంలో సబ్‌ రిజిస్ట్రార్‌పై అనేక ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు