- తిరుపతిలో కుళ్లిన జీవాలతో పదార్థాల తయారీ
- రూ.99కే బిర్యానీ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
- ఆరోగ్యశాఖ తనిఖీలు… టన్నుల కొద్దీ పొట్టేలు తలకాయలు, కాళ్లు స్వాధీనం
- నెలల తరబడి డీప్ఫ్రీజర్లలో నిల్వ ఉంచి ఆహార తయారీ
- మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఐ భారీ ఆందోళన
కళకళలాడే ఆధ్యాత్మిక, రాజకీయ, విద్యా కేంద్రమైన తిరుపతి నగరానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువ. చిన్నా పెద్ద భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు ఎల్లవేళలా గిరాకీ ఉంటుంది. ఒకనాడు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో ఉన్న మాంసాహార హోటళ్లు… నేడు నగరానికి పెరిగిన యాత్రికుల తాకిడిని ఆసరాగా చేసుకుని వీధికి 40 చొప్పున పుట్టగొడుగుల్లా వెలిశాయి.
విశాలాంధ్ర- తిరుపతి: కళకళలాడే ఆధ్యాత్మిక, రాజకీయ, విద్యా కేంద్రమైన తిరుపతి నగరానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువ. చిన్నా పెద్ద భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు ఎల్లవేళలా గిరాకీ ఉంటుంది. ఒకనాడు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో ఉన్న మాంసాహార హోటళ్లు… నేడు నగరానికి పెరిగిన యాత్రికుల తాకిడిని ఆసరాగా చేసుకుని వీధికి 40 చొప్పున పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీనికి తోడు సోషల్ మీడియా, యూట్యూబర్స్ హడావుడి రేటింగుల ప్రచారంతో మాంసాహార ప్రియులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. చివరకు మహానగరాల సంస్కృతిని తలపిస్తూ…‘4ఏఎం బిర్యానీ’ అనే సంస్కృతి తిరుపతిలో జోరందుకుంది. కోడికూత కంటే ముందే హోటళ్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు ఇళ్లల్లో వంటలపై ఆసక్తి చూపని మహిళలు సైతం వేకువజామునే నాన్ వెజ్ కోసం క్యూ లైన్లలో నిలబడుతుండటం గమనార్హం. అయితే ఈ క్రేజ్‌ను కొందరు హోటళ్ల నిర్వాహకులు భారీ వ్యాపార మార్గంగా మార్చుకుని… ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
టన్నుల కొద్దీ నిల్వ మాంసం… గునపాలతో తవ్విన వైనం
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుండి చౌక ధరకే లభించే పొట్టేళ్ల తలకాయలు, కాళ్లను ఇక్కడి వ్యాపారులు టన్నుల కొద్దీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని వారం నుండి మూడు వారాల పాటు, కొన్ని సందర్భాల్లో నెలల తరబడి డీప్ఫ్రీజర్లలో నిల్వ ఉంచుతున్నారు. డిమాండ్‌ను బట్టి వాటిని బయటకు తీసి… కుళ్లిపోయిన వాసన రాకుండా ఉండేందుకు రసాయనాలు, ఘాటైన మసాలాలు దట్టించి ‘తాజా కూరలు’ అంటూ కస్టమర్ల విస్తళ్లలో వడ్డిస్తున్నారు. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులు నగరంలోని అనేక హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో గడ¦కట్టుకుపోయిన టన్నుల కొద్దీ పొట్టేళ్ల తలకాయలు, కాళ్లను అధికారులు గునపాలతో పొడిచి బయటకు తీయాల్సి వచ్చింది. ఈ భీతావహ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మాంసాహార ప్రియులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
రూ. 99 బిర్యానీ మాయాజాలం
తిరుపతి నగరంలో పోటీ పెరగడంతో ‘రూ. 99 కే చికెన్/మటన్ బిర్యానీ’ అంటూ బోర్డులు పెట్టి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ తక్కువ ధరల వెనుక తీవ్రమైన కల్తీ దాగి ఉంది. ఈ హోటళ్లలో తిన్న అనేకమంది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒక్కో కుటుంబం వైద్యం కోసం రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. తమ బాధను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం చెందిన బాధితులు హోటళ్లపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. నగరంలో మాంసం విక్రయించే దుకాణాలు కూడా ఇష్టానుసారంగా వెలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం పొట్టేలు లేదా మేకను వధించే ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం పరీక్షించి… అనుమతి ముద్ర వేయడం తప్పనిసరి. కానీ, ఇక్కడి వ్యాపారులు ముద్ర ఉన్న ఒక పొట్టేలును దుకాణం ముందు వేలాడదీసి…దాని వెనుక ఎలాంటి అనుమతులు లేని, రోగాల బారిన పడి చనిపోయిన జీవాల మాంసాన్ని యధేచ్ఛగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
అధికారుల వైఫల్యంపై సీపీఐ ఆగ్రహం… కార్పొరేషన్ ముట్టడి
వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు మాంసం దుకాణాలు, హోటళ్లపై నిఘా ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కేవలం తాత్కాలిక, నామమాత్రపు తనిఖీలకే పరిమితం కావడం వల్లే అక్రమార్కులకు మార్గం సుగమమైందని స్పష్టమవుతోంది. ఈ కల్తీ మాంసాల దందాకు అడ్డుకట్ట వేయాలని, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ… “రూ. 99 బిర్యానీల పేరుతో ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నారు. తాత్కాలిక దాడులకు పరిమితం కాకుండా నగరంలో నిత్యం తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్ల లైసెన్సులను రద్దు చేసి, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు. అధికారులు నిద్రావస్థ వీడి తక్షణమే పూర్తిస్థాయి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


