Home20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు

20 నెలలు… 6.28 లక్షల ఉద్యోగాలు

- Advertisement -

. ప్రపంచంలో పేరున్న పరిశ్రమలన్నీ తీసుకొస్తున్నాం
. పీపీపీ విధానంలో నిర్మిస్తే అది ప్రైవేట్‌పరం కాదు
. ముమ్మాటికీ అది ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తి
. వైసీపీ పాలనలో అతిపెద్ద మద్యం కుంభకోణం
. అన్ని ప్రాంతాల సమగ్రాభివద్ధే లక్ష్యం
. శాసనసభలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివద్దే లక్ష్యంగా గత 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎంఎసఎంఈలో 2.48 లక్షలు, నైపుణ్యాభివద్ధి ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 కల్పించామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పించి హామీ నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఓ కమిటీని నియమించామని చెప్పారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రసంగించారు.
గత పాలనలో పొరుగు రాష్ట్రాలకు యువత
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిన్నదని చంద్రబాబు చెప్పారు. జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయాయి. వైసీపీ ఉన్నంత వరకూ ఏపీకి తిరిగి రామని చెప్పాయి. పూర్తిగా నెగెటివ్ ఇమేజ్ సృష్టించి గత పాలకులు వెళ్లారు. 2019-20 నుంచి 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 913 కంపెనీలు మూతపడినట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేది. ఇప్ప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ ఉంది. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటిద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తున్నాం. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ తయారవుతుంది. విశాఖ ఐటీ, జీసీసీ కేంద్రంగా తయారవుతుంది. ఎవరూ ఊహించనన్ని పెట్టుబడులు విశాఖకు వచ్చాయి’ అని సీఎం వెల్లడించారు.
ప్రముఖ పరిశ్రమలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి
‘అమరావతికి క్వాంటం లాంటి ఎకోసిస్టం వస్తోంది. తిరుపతిని స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్సు పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాం. గూగుల్, టాటా- టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చాయి. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ వస్తోంది. 20 నెలల్లోనే ప్రపంచంలోనే పేరున్న పరిశ్రమలు, కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఈ నెలలో ఆర్సెలార్ మిత్తల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి శ్రీకారం చుట్టాం. ఎన్టీపీసీ ద్వారా 1.85 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ తయారీ కోసం ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. టాటా సంస్థ రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఇలా ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఈ పెట్టుబడులను సుస్థిరం చేయడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్‌గా మారుతుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
‘పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. గత పాలకులు కనీసం వైద్య కళాశాలలకు భూమి కూడా చూపించలేదు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీపీపీ అంటే ప్రైవేటుకాదని మరోమారు ప్రజలకు చెబుతున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. అన్ని మెడికల్ కళాశాలల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయి. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం చెప్పారు.
తెలుగును కాపాడే బాధ్యత తీసుకుంటాం
‘విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఏటా రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులతో సమీక్షించుకుంటున్నాం. గత పాలకుల వల్ల విద్యారంగం దిగజారింది. ప్రాథమిక విద్య ఎక్కడైనా మాతృభాషలోనే ఉంటుంది. ప్రపంచానికి తెలివైన యువతను అందించటంతో పాటు తెలుగును కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎక్సైజ్‌లో వైసీపీ భారీ కుంభకోణం
‘ఎక్సైజ్‌లో గతపాలకులు అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ వేసి విచారణ చేస్తున్నాం. సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇప్ప్పుడు మొత్తం పారదర్శకంగా మార్చి అంతర్జాతీయ బ్రాండ్లు తీసుకువచ్చాం. ఎవరు తప్ప్పు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే మాకు అత్యంత ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సేవించి 30 వేలమంది అనారోగ్యాల పాలై మరణించారు. ప్రస్తుతం ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు