Saturday, April 19, 2025
Homeతెలంగాణచార్జీలు పెంచే యోచనలో మెట్రో..

చార్జీలు పెంచే యోచనలో మెట్రో..

నగరంలో ట్రాఫిక్ చిక్కులు, అనారోగ్యానికి కారణమయ్యే కాలుష్య బెడదను తప్పించుకోవడానికి సిటీవాసులకు ఉన్న ఏకైక సాధనం మెట్రో.. సిటీలో తక్కువ ఖర్చుతో సుఖంగా ప్రయాణం చేయడం మెట్రోతోనే సాధ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో ఏసీ వాహనంలో ప్రయాణించాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. అందుకే జంట నగరాల పరిధిలో నిత్యం లక్షలాదిమంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇకపై మెట్రో ప్రయాణం కూడా భారం కానుందని సమచారం. కరోనా కాలం నుంచి కొనసాగుతున్న నష్టాలను భర్తీ చేసుకోవడానికి హైదరాబాద్ మెట్రో అధికారులు ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ఇటీవల ప్రకటించింది. ఛార్జీల పెంపునకు 2022లో అప్పటి బీఆర్ఎస్ సర్కారుకు విజ్ఞప్తి చేయగా.. సానుకూలంగా స్పందించిన సర్కారు ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ యాక్ట్‌-2002 కింద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎల్ అండ్ టీ ప్రతిపాదనలు, ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించాక ఛార్జీల పెంపునకు కమిటీ ఓకే చెప్పింది. అయితే, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఛార్జీల పెంపునకు నాటి బీఆర్ఎస్ సర్కారు అంగీకరించలేదు. దీంతో ఛార్జీల పెంపు ప్రతిపాదన పక్కన పడింది.

రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాజాగా ఈ ప్రతిపాదనను మెట్రో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. భారీ నష్టాలను చవిచూస్తున్నామని, ఛార్జీల పెంపునకు ఆమోదం తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఛార్జీల పెంపు తప్పేలా లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటీవలే బెంగళూరు మెట్రో కూడా ఛార్జీలు పెంచిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. బెంగళూరు మెట్రో ఏకంగా ఛార్జీలను 44 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఏమేరకు పెంచాలని కోరుతుందనే వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం మెట్రో ఛార్జీలు కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.60 లుగా ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు