. మోడ్రన్ టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి
. రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్థులకు అవకాశం
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్తు విధానాలతో క్యాంపస్ నిర్మించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏఐ, ఐఓటి ఆధారిత సేవలతో మొట్టమొదటి డిజిటల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బిట్స్ మూడు శాఖలు కలిగి ఉంది. పిలానీ, హైదరాబాద్, గోవా తరువాత ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. 35 ఎకరాల్లో వెయ్యి కోట్లతో బిట్స్ క్యాంపస్ 2027 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న బిట్స్ క్యాంపస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉంటుంది. ఈ క్యాంపస్‌లో 7 వేల మంది విద్యార్థులను రెండు విడతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో చేర్చుకోనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా అండర్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. బిట్స్ పిలానీ డిజిటల్ పేరుతో కొత్తగా 32 ప్రోగ్రామ్స్ ప్రారంభించనున్నారు. ఇందులో 11 డిగ్రీ కోర్సులు కాగా 21 సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. ఈ క్యాంపస్‌లో కృత్రిమ మేధ , డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ వంటి ప్రోగ్రాములకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఏఐ ఫర్ హెల్త్‌కేర్, జనరేటివ్ ఏఐ, స్మార్ట్ సిటీస్ వంటి కొత్త సబ్జెక్ట్‌లపై ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. అంతేకాదు, ఈ క్యాంపస్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ హబ్‌గా, పారిశ్రామిక భాగస్వామ్యాల కేంద్రంగా మారబోతోంది. బిట్స్ అమరావతి క్యాంపస్‌ను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా నిర్మించనున్నట్టు సమాచారం. విద్యార్థులు మొదటి రెండేళ్లు అమరావతిలో, తర్వాత రెండు సంవత్సరాలు విదేశీ భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో చదివేలా డ్యుయల్ డిగ్రీ విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని, జాయింట్ పీహెచ్‌డీ కార్యక్రమాలను కూడా ప్రవేశపెడతామని బిట్స్ యాజమాన్యం తెలిపింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం బిట్స్ కు కేటాయించింది.
ఆలయ నమూనాలోనే క్యాంపస్ భవనాల నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్ ఆధారిత మౌలిక సదుపాయాలతో పాటు లాట్, ఏఐ ఆధారిత సేవలు ఉండే డిజిటల్ ఫస్ట్ క్యాంపస్‌గా అభివృద్ధి చేస్తారు. ఇది భారతదేశంలో నే ప్రత్యేకంగా నిలవనుంది. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడిరచారు. ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపు దిద్దుకుంటుంది. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు క్వాంటం వ్యాలీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బిట్స్ క్యాంపస్ ఏర్పాటైతే రూపురేఖలు మారిపోవచ్చు. ఈ కొత్త కేంద్రంతో ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్‌లు, పరిశోధనలు, పారిశ్రామిక భాగస్వామ్యాలకు మరింత ఊతం లభించనుంది.


