. నూతన రైలు మార్గాలకు అనుమతులు
. కేంద్ర మంత్రి వైష్ణవ్‌కు సీఎం రేవంత్ వినతి
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన… అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. సీఎం, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… రైల్ భవన్లో గురువారం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకంను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వీటన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో రైల్వే అనుసంధానం పెంపునకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని… ఇందుకు రైల్వే బోర్డు ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని సీఎం తెలిపారు. రూ.ఎనిమిది వేల కోట్ల విలువైన ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ తగ్గుతుందని వివరించారు.
దీంతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సీఎం తెలిపారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో రైల్వే నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలకు ఇది దోహదపడుతుందన్నారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని వినతి చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్-కృష్ణా (122 కి.మీ… అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి-మాచర్ల (100 కి.మీ… అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్-గద్వాల (296 కి.మీ… అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్-మిర్యాలగూడ (97 కి.మీ… అంచనా వ్యయం రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.


