

స్మార్ట్ మీటర్లపై ప్రజాగ్రహం
సబ్ స్టేషన్ల వద్ద దద్దరిల్లిన ధర్నాలు
. భారీగా తరలివచ్చిన వామపక్ష, ప్రజాసంఘాల శ్రేణులు
. విరమించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని నేతల హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్టేషన్‌ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల శ్రేణులతోపాటు పార్టీలకతీతంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిపై వెనక్కి తగ్గకపోతే విద్యుత్ ఉద్యమం తీవ్రమవుతుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అండ చూసుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మంచి పాలన తెస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రాష్ట్ర ప్రజల్ని విద్యుత్ భారాల వైపు నెడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా విద్యుత్ ఒప్పందాలు చేసుకొని ప్రజలపై విపరీతమైన విద్యుత్ భారాలు మోపిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల అధ్వర్యంలో పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ కూడలి నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇచ్చి… అధికారంలోకి వచ్చాక సామాన్యులపై అధిక భారం మోపారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగులగొట్టాలని పిలుపునిచ్చిన నారా లోకేశ్…పెంచిన విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల బిగింపుపై స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన అమలాపురం ఈదరపల్లి విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఫీుభావం తెలిపారు. విజయవాడ నగరంలోని కృష్ణలంక, వన్‌టౌన్, సింగ్‌నగర్, శ్రీనగర్ కాలనీ, గాంధీహిల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ఎదుట, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటిపీఎస్, గంపలగూడెం, ఎ.కొండూరు, తిరువూరు, జగ్గయ్యపేట తదితర విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద పెద్దఎత్తున ధర్నాలు చేపట్టి విద్యుత్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు కేవీ భాస్కరరావు, మల్లి పట్నాయక్, లక్ష్మీ…. స్మార్ట్ మీటర్లు మాకొద్దు బాబోయ్ హాస్య వీధినాటిక ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు బిగిస్తూ సామాన్య ప్రజలపై పాత, కొత్త బకాయిలు కలిపి ఈ ఒక్కనేడాదే రూ.50 వేల కోట్ల భారాల ఉరి వేశారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అదానీ కోసం స్మార్ట్‌మీటర్లు పెడుతూ ఇష్టం వచ్చిన విధంగా బిల్లులు వేస్తున్నారని, కొత్తగా ట్రూఅప్ చార్జీలు రూ.12,771 కోట్లను వినియోగదారులపై రుద్దేందుకు నోటీసు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు ఇష్టం ఉంటేనే మీటర్లు బిగిస్తున్నామని మంత్రి చెబుతుంటూ విద్యుత్ సిబ్బంది గోడలు దూకిమరీ మీటర్లు బిగించి వెళుతున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీన్నే కొనసాగిస్తే తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు. చలసానినగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. సింగ్‌నగర్ విద్యుత్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమానికి సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు సంఫీుభావం తెలియజేసి… ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గాంధీహిల్ సబ్‌స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, కోడుమూరు మండల కేంద్రం ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్ పాల్గొన్నారు. గుంటూరు నగరం కొత్తపేటలోని విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రధాన సబ్ స్టేషన్‌ను సీపీఐ అధ్వర్యంలో ముట్టడిరచారు. ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ నాయకులను పోలీసు స్టేషనుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో జాఫర్‌తోపాటు శింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి.నారాయణస్వామి, బీకేఎస్ మండల కార్యదర్శి బండి రామకృష్ణ తదితరులు ఉన్నారు.


