Homeతెలుగువారిని రక్షిస్తాం: లోకేశ్‌

తెలుగువారిని రక్షిస్తాం: లోకేశ్‌

- Advertisement -

నేపాల్‌ నుంచి 22 మంది తరలింపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : హింస ప్రజ్వరిల్లిన నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు పౌరులను రాష్ట్రానికి సురక్షితంగా తరలిస్తామని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇందుకోసం ఆయన బుధవారం అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని రాష్ట్ర సచివాలయంలోని రియల్‌-టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ కంట్రోల్‌ రూమ్‌ నుండి సమీక్షించారు. దిల్లీలోని ఏపీ భవన్‌, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారులను సమన్వయం చేస్తూ తెలుగు ప్రజలను రప్పించే మార్గాలపై చర్చించారు. రాష్ట్రమంత్రులు వంగలపూడి అనిత, కందుల రమేశ్‌ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సుమారు 300 మందికి పైగా ఆంధ్రప్రదేశ్‌ నివాసితులు నేపాల్‌లో చిక్కుకున్నట్లు ్ల అధికారులు గుర్తించారు. చైనా సరిహద్దుకు సమీపంలోని పింగల్‌స్థాన్‌లో 90 మంది, పశుపతిలో 55 మంది, బఫల్‌లో 27 మంది, సిమికోట్‌లో 12 మంది ఉన్నట్లు అధికారులు లోకేశ్‌కు తెలియజేశారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత వారిని తరలించేందుకు వీలుగా వారి పేర్లు, స్వస్థలాలు, సంప్రదింపు వివరాల యొక్క ఖచ్చితమైన జాబితాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వ్యక్తిగతంగా అనేక మంది బాధితులతో నేరుగా మాట్లాడారు. పోఖారాలో తన వస్తువులు ఎలా ధ్వంసమయ్యాయో వైజాగ్‌కు చెందిన సూర్య ప్రభ మంత్రికి తెలిపారు. ఖాట్మండులో తనతో పాటు 81 మంది ఉన్నామని, ఆహారం కొరతతో ఇబ్బందిపడుతున్నామని విజయనగరంకు చెందిన మురళి తెలిపారు. సిమికోట్‌ సమీపంలోని అప్పారావు తన బృందం డార్మిటరీలో సురక్షితంగా ఉన్నామని, అయితే విమానాశ్రయం మూసివేత కారణంగా సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని నివేదించారు. మేము మిమ్మల్ని అందరినీ ఇంటికి తిరిగి తీసుకువస్తామని, దయచేసి ఇళ్లల్లోనే ఉండాలని మంత్రి లోకేశ్‌ వారికి ధైర్యం చెప్పారు. పత్రాలు పోగొట్టుకున్న వారికి తాత్కాలిక పాస్‌పోర్ట్‌లు జారీ చేసేలా చర్యలు తీసుకుని, ఖాట్మండు విమానాశ్రయం తిరిగి తెరిచిన తర్వాత విశాఖపట్నం లేదా విజయవాడకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అవసరమైతే లక్నో, వారణాసి ద్వారా సరిహద్దు క్రాసింగ్‌లను ఉపయోగించడం వంటి ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి పౌరుడిని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా స్థానిక కలెక్టర్ల సమన్వయంతో సురక్షితంగా వారి స్వస్థలాలకు తిరిగి పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని లోకేశ్‌ చెప్పారు. బాధిత కుటుంబాలు సహాయం పొందడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ 9818395787, దిల్లీ ఏపీ భవన్‌లోని 98183957878, 08632381000 నెంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు.
22మంది తరలింపు
తొలివిడతగా నేపాల్‌ లోని హెటౌడా నుంచి 22మంది తెలుగుపౌరులను సురక్షితంగా బీహార్‌ రాష్ట్ర సరిహద్దుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిలటరీ సాయంతో హెటౌడా నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న బీహార్‌ సరిహద్దు మోతిహరికి తెలుగుపౌరులు బయలుదేరారు. వీరిని రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు