అఖిల భారత వీరశైవ మహాసభ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు దండిన శివానంద
విశాలాంధ్ర -ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పాలక వర్గ కమిటీలలో వీరశైవులకు ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలభారత వీరశైవ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు దండిని శివానంద పేర్కొన్నారు. బుధవారం స్థానిక వీరశైవ కళ్యాణమండపం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల ప్రణాళికలో శైవ క్షేత్రాలలో పాలకమండలి అధ్యక్షులుగా వీరశైవ లింగాయతులను మాత్రమే నియమిస్తామని హామీ ఇచ్చారని అయితే ఈ మధ్యకాలంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండలిలో వీరశైవులకు ప్రాధాన్యత కల్పించలేదని దీని పట్ల అఖిలభారత వీరశైవ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా అనంతపురం జిల్లాకు చెందిన స్వప్న ని కూటమి ప్రభుత్వం నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 2009లో గత ప్రభుత్వం వీరశైవ లింగాయత్,లింగ బలిజ కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగిందని అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఓబీసీ జాబితాలో తమ కులాలను చేర్చ లేదన్నారు. ఓబీసీలో చర్చేందుకు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపి అది ఆమోదం పొందేటట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని గతంలో కూడా తాము ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం జరిగిందన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇదే విషయాన్ని గతంలో అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగిందని ఆయనకు అఖిలభారత వీరశైవ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విద్యా ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అత్యంత వెనుకబడిన వీర శైవ లింగాయత్,లింగ బలిజ సమాజములను ప్రభుత్వాలు గుర్తించాలని తమ కులాన్ని ఓబీసీల చేర్చేందుకు రాష్ట్రంలోనే తెలుగుదేశం జనసేన, బిజెపి పార్టీల అగ్ర నాయకులు కూడా సానుకూలంగా స్పందించాలన్నారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు విజ్ఞప్తి
రాష్ట్రంలో దేవాలయ పాలకవర్గ కమిటీలలో వీరశైవ లింగాయతులకు ప్రాధాన్యత కల్పించాలని తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం పొందేటట్లు కృషి చేయాలని బుధవారం ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి వారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీరసేవ లింగాయత ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షులు నాగన్న గౌడ్, వీరశైవ సమాజం డైరెక్టర్ గంగాధర్, సురేష్ గౌడ్, జంగం లింగాయత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నాగరాజు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


