— ఎమ్మెల్యే గోరంట్ల.
విశాలాంధ్ర – కడియం : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక గ్రామంలో పల్లాలమ్మ గుడి పక్కన ఉన్న సిసి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 31 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని పాముల మెట్ట వద్దగల జగనన్న కాలనీ ఆయన సందర్శించారు. రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ “తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి” అన్నట్లుగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని విమర్శించారు. ఏదో పేరుకి పట్టాలిచ్చింది కానీ, కాలనీలో కనీస అవసరాలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలోనే స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఎంఆర్ పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, కడియపులంక సర్పంచ్ మారిశెట్టి పద్మావతి, ఎంపీడీవో కే రమేష్, తాసిల్దార్ ఎం సునీల్ కుమార్, గట్టి నరసయ్య, బోడపాటి గోపి, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


