-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్
విశాలాంధ్ర-రాప్తాడు : రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగు చేసే వ్యవసాయ, వాణిజ్య పంటలకు చీడ, పీడలు ఆశించకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్ధిష్ట సలహాలు అందజేస్తుందని వాటిని పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రవికుమార్ సూచించారు. రాప్తాడు మండలం రామినేపల్లి, గంగులకుంట గ్రామాల్లో రబీ పంట సాగు పొలాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణచైతన్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది గిరిబాబుతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రబీ 2025-26 సీజన్ కి సంబంధించి పంటసాగు చేసిన ప్రతి రైతు కూడా ఈనెల 20వ తేదీలోపు ఈ-పంట నమోదుకు చేసుకోవాలన్నారు.
తద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు.
మండలంలోని ప్రతి రైతు కూడా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఏపీఎఫ్ఆర్) నమోదు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో చేసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల కోసం ఏపీఏఐఎంఎస్ 2.0 అనే యాప్ ను తయారు చేసిందని ఇందులో వ్యవసాయానికి సంబంధించి అన్ని సూచనలు సలహాలు ఉంటాయని, రైతులందరూ ఈ యాప్ ను వినియోగించాలన్నారు. అదేవిధంగా రామినేపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రతినిధి బోగినేపల్లి సీసీ రాముతో రైతుల రిజిస్ట్రేషన్, కందుల నాణ్యతను మార్క్ ఫెడ్ పెన్నేశ్వరి, టెక్నికల్ ఏఓ వంశీతో కలిసి పరిశీలించారు.


