Homeసాహిత్యంయుద్ధమూ ఒక వ్యాపారమే…!

యుద్ధమూ ఒక వ్యాపారమే…!

- Advertisement -

యివాల…
యుద్ధ దేవత వికటాట్టహాసానికి
గుక్కపట్టి ఏడుస్తున్న భూగోళాన్ని
భుజానకెత్తుకొని ఎవరు ఓదారుస్తారు?

ప్రభువులు…బుర్రలో పురుగు కదిలినపుడు
యుద్ధాలు ప్రకటిస్తారు
దానికి…సార్వభౌమత్వమని పేరు పెడతారు!

అంతే…నడివీధుల్లో ఉన్నట్టుండి
ఉవ్వెతున దేశభక్తి ప్రవహిస్తుంది
దేశాల మధ్య యుద్ధమేఘాలు
కమ్ముకుంటాయి!

అంతటా…కర్ఫ్యూ అమలయ్యే వేళ
ఆయుధ వ్యాపారులు మాత్రమే
దుకాణాలు తెరుస్తారు
వాళ్లకు యుద్ధమూ ఒక వ్యాపారమే!

ఒక క్షిపణి…ఒక వీరుడి
తల్లిపేగును తెంచి పారేస్తుంది
మరో శతఘ్ని…ఒక కొత్త పెండ్లికూతురు
నుదుటన సూరీడ్ని తుడిచేసి పోతుంది
ఒంజిపెట్టి కోసినట్టు యింకో యుద్ధవిమానం…
వేల తాళిబొట్టుల్ని ఒకేసారి తెంపుకుపోతుంది!
ఇళ్లు…వల్లకాళ్లవుతాయి
కనిపించిన నేలంతా గాయపడీ
ధూళితో…నెత్తుటితో తడిసిపోతుంది
వికత క్రీడ ఆడీఆడీ…విసుగొచ్చిన ఏలికలు
కాసేపటికి విరామం ప్రకటిస్తారు!

తెల్లజెండాలు ఎగరేస్తారు
విరిచిన రెక్కలకు ఉమ్మితడి పూసీ
పావురాలు విడిచిపెడతారు
మళ్లీ పరస్పర కరచాలనాలు చేసుకుంటారు!

రహస్య ఒప్పందాలు అమల్లోకొస్తాయి
స్టాక్ మార్కెట్లు మళ్లీ రంకెలేస్తాయి
కార్పొరేట్ల వాకిట్లో లాభాలపంట పండుతుంది
వేలాది మతుల మత్తికలతో…!

సైనికుడిది ఒక మరణమే…
కానీ…సామాన్యుడిది నిత్య మరణం
యుద్ధం ముగిసాకే…అతడికి
అసలు యుద్ధం మొదలవుతుంది!!
`సిరికి స్వామినాయుడు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు