- Advertisement -
- 1000కి 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ
- తల్లి ఆశయమే లక్ష్యంగా కష్టపడి చదివిన విద్యార్థిని
- రాప్తాడు : విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాప్తాడు మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాసులు, దివంగత ఉమాదేవి దంపతుల కూతురు నిత్యశ్రీ అద్భుత ప్రతిభ కనపరిచింది. ఇంటర్ బైపీసీ విభాగంలో ఈమె 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించిన నిత్యశ్రీ, ఇంటర్మీడియట్ చిలమత్తూరు మండలం టేకులోడులోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యసించింది. ఏడాది క్రితం తల్లి ఉమాదేవి అనారోగ్యంతో మరణించినప్పటికీ, ఆ బాధను దిగమింగుకుని తన తల్లి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ఏమాత్రం కుంగిపోకుండా చదివి ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రి, విశాలాంధ్ర రాప్తాడు రిపోర్టర్ బుడగల శ్రీనివాసులు, పెద్దమ్మ కుమారి, బీటెక్ సెకండియర్ చదువుతున్న సోదరుడు అక్షయ్ సాగర్, కుటుంబ సభ్యులు మరియు కళాశాల ఉపాధ్యాయుల నిరంతర ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని నిత్యశ్రీ పేర్కొంది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. ఒక సాధారణ జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చి, ప్రభుత్వ కళాశాలలో చదువుతూ అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల స్థానిక ప్రజలు, బంధువులు మరియు జర్నలిస్టు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ నిత్యశ్రీని అభినందించారు.


