ఏవి నాగేశ్వరావు
విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు, పర్మినెంట్, స్కిల్ అప్ గ్రేడేషన్ ఇతర న్యాయమైన డిమాండ్స్ పై ఆందోళన చేపట్టారు. వీరికి సిఐటియు జిల్లా నాయకత్వ బృందం హాజరై కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ బృందంలో సిఐటియు రాష్ట్ర కమిటి సభ్యులు టి.అరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. పవన్, జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు, జిల్లా నాయకులు బి పూర్ణిమారాజు, కర్రి రామకృష్ణ, గంటి కృష్ణ, కోనసీమ జిల్లా నాయకులు కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల సమస్యను చర్చలు ద్వారా పరిష్కరించకుండా, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగేలా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించిందని నాగేశ్వరావు పేర్కొన్నారు. 11 మంది పర్మినెంట్ యూనియన్ నాయకులు , 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా సస్పెండ్ చేసిందని యాజమాన్యం నిరంకుశ వైఖరిని ఖండించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఏకపక్షంగా మిల్లు లాకౌట్ పెట్టడం దుర్మార్గం అన్నారు. కార్మికులపై ఎటువంటి కక్షసాధింపు చర్యలు ఉండకూడదన్నారు. వేతన ఒప్పందం ముగిసి 3 సంవత్సరాలు కాలం గడిచినా, నూతన ఒప్పందం చెయ్యక పోవడమేమిటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పర్మినెంట్ స్వభావం ఉన్న ప్రాంతాలలో, కాంట్రాక్ట్ కార్మికులను, ధీర్గ కాలంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసి స్కిల్ అప్ గ్రేడ్ చెయ్యాలని అన్నారు. కార్మికుల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు. సిఐటియు రాష్ట్ర కమిటి సభ్యులు అరుణ్ మాట్లాడుతూ 4 సార్లు జరిగిన జాయింట్ మీటింగ్ లలో యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించిందని, ఇప్పటికైనా కార్మికుల కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. తూర్పుగోదావరి జిల్లా కమిటి నుండి కార్మికులకు అండగా ఉంటామని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సుందర్ బాబు, బి పవన్ లు తెలిపారు. కార్మికులకు మద్దతుగా జిల్లాలో అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.


