యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు
కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు…

విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు కూడా గాలివాన ధాటికి దెబ్బతిని చెట్లు నేలకూలాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నాశనమవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టపడి సాగు చేసిన పంట ఒక్క రాత్రిలో నేలమట్టమైంది” అంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రకృతి విపత్తు మరింత దెబ్బతీసిందని వారు వాపోయారు.సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన స్థలాలకు చేరుకుని విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ పరిహారం అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


