Homeమరో ‘మెహతా’ స్కామ్

మరో ‘మెహతా’ స్కామ్

- Advertisement -

. 15 లక్షల కోట్ల ఆదాయమంటూ పెట్టుబడిదారులకు టోకరా
. పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లింపు
. సెబీ చేతికి చిక్కిన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ గోల్డ్‌కింగ్ రాజేశ్ మెహతా

న్యూదిల్లీ: కొన్నేళ్ల క్రితం దేశీయ స్టాక్ మార్కెట్లను హర్షద్ మెహతా ఆర్థిక కుంభకోణం కుదిపేసిన సంగతి తెలిసిందే. దేశంలో మరోసారి అటువంటి భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇప్పుడు మరో మెహతాకు చెందిన కంపెనీలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నిగ్గుతేల్చింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ గోల్డ్ జువెల్లరీ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ లో జరిగిన కుంభకోణంపై కీలక నివేదిక విడుదల చేసింది. గత 5 సంవత్సరాల్లో (ఆర్థిక సంవత్సరం 2021 నుంచి 2025) ఏకంగా రూ.15.15 లక్షల కోట్లు (180 బిలియన్ డాలర్లు) గ్రూప్ ఆదాయాన్ని తప్పుగా, అదనంగా చూపించినట్లు సెబీ తన 109 పేజీల తాత్కాలిక ఆర్డర్‌లో పేర్కొంది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8 శాతం ఆదాయం నకిలీ లేదా తప్పుగా సృష్టించినదేనని సెబీ ఆరోపించడం మార్కెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సెబీ… రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ మెహతాను కంపెనీ షేర్లలో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. 2024 మార్చిలో ఒక షేర్ హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెబీ ఈ విచారణ చేపట్టింది. అయితే, దర్యాప్తు అధికారులకు, ఫోరెన్సిక్ ఆడిటర్లకు కంపెనీ ఎలాంటి అకౌంటింగ్ పుస్తకాలను, వివరాలను ఇవ్వకుండా దాటవేసిందని సెబీ వెల్లడించింది.
విదేశీ సబ్సిడీల పేరుతో మాయాజాలం
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తన మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయంలో 97-99 శాతం వరకు కేవలం సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి విదేశీ సబ్సిడీ కంపెనీల నుంచే వస్తున్నట్లు చూపించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్‌కంబీ అనే సంస్థను తమ ప్రధాన ఆపరేటింగ్ కంపెనీగా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ పేర్కొంది. కానీ వాల్‌కంబి అసలు ఆదాయం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ గ్రూప్ లెక్కల్లో చూపించిన ఆదాయంలో 0.5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు సెబీ దర్యాప్తులో తేలింది. దీనిపై నిలదీయగా కంపెనీ యాజమాన్యం స్విస్ డేటా ప్రొటెక్షన్ చట్టాల నెపం చూపిస్తూ సమాచారాన్ని దాచే ప్రయత్నం చేసింది. సెబీ తన ఆర్డర్‌లో మరో సంచలన నిజాన్ని బయటపెట్టింది. సీఎండీ రాజేశ్ మెహతా తన వ్యక్తిగత అకౌంట్ ద్వారా ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో చేసిన డెరివేటివ్స్ లావాదేవీలను రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ బంగారు నగలు కొనుగోళ్లు, అమ్మకాలు దాదాపు రూ.11,480 కోట్లుగా కంపెనీ పుస్తకాల్లో రికార్డ్ చేశారని సెబీ నిర్ధారించింది. అంటే వ్యక్తిగత ట్రేడింగ్ నష్టాలు లేదా లాభాలను కంపెనీ బిజినెస్ గా మార్చి ఇన్వెస్టర్లను మోసం చేశారని తెలిపింది. ఇంత భారీ స్థాయిలో 97-99 శాతం ఆదాయాన్ని తప్పుగా చూపించడం అనేది కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పుడూ వినని అత్యంత ఘోరమైన విషయంగా సెబీ హోల్ టైమ్ మెంబర్ ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంపెనీ అకౌంట్లను క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు సెబీ మరో ఫోరెన్సిక్ ఆడిట్‌ను ఆదేశించినట్లు చెప్పారు. సెబీ నుంచి ఈ 109 పేజీల ఎక్స్- పార్టీ ఆర్డర్ బయటకు వచ్చిన క్రమంలో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేరు భారీగా పతనమైంది. ఇన్వెస్టర్లు భయంతో తమ షేర్లను విక్రయించడంతో ఈ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకింది. గత ఏడాది కాలంలోనే ఈ షేరు దాదాపు 46 శాతం పైగా విలువను కోల్పోయి ఇన్వెస్టర్ల సంపదను భారీగా ఆవిరి చేసింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ.103.92 వద్ద ట్రేడవుతోంది.
ఎలఐసీ వాటా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌లె ఆర్థిక అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఆ సంస్థలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎలఐసీ)కు ఉన్న 10.8 శాతం వాటా సంగతేంటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందిస్తూ… ప్రస్తుతం నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉన్న ఒక కంపెనీలో ఎలఐసీకి గణనీయమైన వాటా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంస్థలో ఎలఐసీ పెట్టుబడిపై ప్రభావం ఉందా అనే దానిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. “2020/21 నుండి 2024/25 వరకు ఐదేళ్ల కాలంలో ఆదాయాలను తప్పుల తడకగా చూపించారని, దీని విలువ ఏకంగా రూ. 15 లక్షల కోట్లు ఉండవచ్చని సెబీ చెబుతోంది” అని రమేశ్ అన్నారు. ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే… రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎలఐసీకి సుమారు 10.8% వాటా ఉండటమని తెలిపారు. బ్యాంకులకు కూడా ఆ కంపెనీలో గణనీయమైన వాటాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇటువంటి అవకతవకలు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. దీంతో అధికార వర్గాల ఆదేశాల మేరకే ఎలఐసీ ఇంత పెద్ద వాటాను కొనుగోలు చేసిందా అనే ప్రశ్నను లేవనెత్తుతోందని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు