ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, డాయిచే బ్యాంక్ ఏజీ, దాని భారత శాఖ ద్వారా వ్యవహరిస్తూ, భారతదేశంలోని డాయిచే బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, సంపన్న ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త మేనేజ్మెంట్ వ్యాపారాన్ని కోటక్ కొనుగోలు చేయడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించాయి. ఈ వ్యాపారంలో సుమారుగా రూ. 29,000 కోట్ల (సుమారు యూరో 2.7 బిలియన్లు) రుణాలు, రూ. 16,000 కోట్ల (సుమారు యూరో 1.5 బిలియన్లు) డిపాజిట్లు, నిర్వహణలో ఉన్న రూ. 10,500 కోట్ల (సుమారు యూరో 1.0 బిలియన్) ఆస్తులు ఉన్నాయి. ఇది సుమారు 1,000 మంది ఉద్యోగుల బృందం ద్వారా దాదాపు 1,50,000 మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ కొనుగోలుపై కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అశోక్ వాస్వానీ వ్యాఖ్యానిస్తూ, “ఈ లావాదేవీ సంపన్న, ఎస్ఎంఈ వర్గాలపై మాకున్న దృష్టికి చక్కగా సరిపోతుంది. ఇది వ్యూహాత్మకంగా చాలా అనుకూలమైనది. వాణిజ్యపరంగా కూడా సరైన నిర్ణయం. ఇది ఉన్నత-నాణ్యత గల వినియోగదారుల సమూహాన్ని, అనుభవజ్ఞులైన బృందాలను తీసుకురావడంతో పాటు, అదనపు విస్తరణ, అనుబంధ అవకాశాలను కూడా అందిస్తుంది. ఈ వినియోగదారులను, సోద్యోగులను కోటక్ కుటుంబంలోకి సాదరంగా స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాము. ఈ వ్యాపారంలో మరింత లోతును, సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, క్రమబద్ధమైన ఏకీకరణ మరియు కొనసాగింపును నిర్ధారించడంపై మా ప్రాధాన్యత ఉంటుంది.” అని అన్నారు.


