తెలంగాణ ఆరు హత్యల హంతకుడి మనస్తత్వానికి, జగన్ వైఖరికి దగ్గరి పోలికలున్నాయని వ్యాఖ్య
సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని, అదొక గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రాలని, వారి చరిత్ర మొత్తం రక్త చరిత్రేనని విమర్శించారు. తెలంగాణలో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన హంతకుడి మనస్తత్వానికి, జగన్ వైఖరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల విలువైన సహజ సంపద ఆవిరైందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు కేటాయించిన భూములను ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.
జగన్, ఆయన కుటుంబం వల్ల ఎందరో ఐఏఎస్ అధికారులు బలయ్యారని, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేవారిని బెదిరించి, పరిశ్రమలను తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
వైసీపీ నైజాన్ని చంద్రబాబు ఃహిట్, రన్ అండ్ ఎస్కేప్ గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించి, పక్క రాష్ట్రంలోని బెంగళూరులో తలదాచుకోవడం వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననాలకు, మహిళలను బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారని, ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ పోస్టులను కట్టడి చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం రైతుల భూములను 22ఏ జాబితాలో పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, తమ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తోందని హామీ ఇచ్చారు.
ఆ హంతకుడికి, జగన్‌కు దగ్గరి పోలికలు
ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన ఓ దారుణ ఘటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓ వ్యక్తి తనపై పోక్సో కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, తనకు సహకరించలేదని సొంత కుటుంబాన్ని కూడా కిరాతకంగా హత్య చేశాడు. అటువంటి సైకో మనస్తత్వానికీ, సొంత బాబాయిని చంపడం, కన్నతల్లి, చెల్లి విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి అని అన్నారు.
వైసీపీ నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందని సూచించారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తికావస్తుండటంతో గొడ్డలి పార్టీలో టెన్షన్ మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.


