Homeసంపాదకీయంరగులుతున్న జంతర్ మంతర్

రగులుతున్న జంతర్ మంతర్

- Advertisement -

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ప్రసిద్ధ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. ఇది క్రమంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన రూపం సంతరించుకుంటోంది. అనేక మంది యువకులు ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు చెందినవారు వాంగ్ చుక్‌కు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శన ప్రారంభమైన వెంటనే ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రశ్రేణి నేతలు జంతర్‌మంతర్ వెళ్లి సహానుభూతి వ్యక్తం చేశారు. మిగతా రాజకీయ పార్టీలకు ఈ ఆందోళన పెద్దగా పట్టినట్టు లేదు. సోనం వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు చలించిన దాఖలాలే లేవు. ఆయన ఇప్పటికే ఎనిమిదిన్నర కిలోల బరువు తగ్గిపోయారు. తగ్గనిదల్లా ప్రభుత్వం మెడలు వంచాలన్న ఆయన సంకల్ప బలమే. 2011లో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 11 రోజుల తరవాత అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ముగించారు. సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష ప్రారంభించి 16 రోజులు గడిచినా మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం ఆశ్చర్యం కలిగించడం లేదు. అది నిరంకుశ ప్రభుత్వాల వైఖరికి తార్కాణమని మరోసారి రుజువైంది.
జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న వారు మండుటెండలను, అప్పుడప్పుడూ భారీ వర్షాలను సైతం లెక్క చేయడం లేదు. నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్ష్మీణించిన కొందరు విద్యార్థులను ఇప్పటికే రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రధానాంశం కాదు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటున్నారు. అప్పుడు ఆయన మంత్రిత్వ శాఖ మారిపోవచ్చు లేదా ఆయనకు మరేదైనా బాధ్యత అప్పగించవచ్చు. వచ్చే సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పార్లమెంటుకు శాంతియుత పద్ధతుల్లో యాత్ర కొనసాగించాలని అభిజిత్ దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తోంది. ఆలోగా పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. మోదీ సర్కారుకు అలవాటైన పద్ధతి ప్రకారం నేడో రేపో సోనం వాంగ్ చుక్‌ను అక్కడి నుంచి తొలగించి ఆసుపత్రిలో చేర్పించి బలవంతంగా ఆహారం అందించే ప్రయత్నం చేయొచ్చు. ఈ క్రమంలో జంతర్‌మంతర్ ఆందోళన ఏ రూపమైనా తీసుకోవచ్చు. కానీ తప్పు చేసిన మంత్రులను, ఉన్నతాధికారులను శిక్షించే, జనం సమస్యలను కనీసం వినిపించుకునే ఓపిక, శ్రద్ధ లేని మోదీ ప్రభుత్వ మంకుతనమే ప్రధానాంశం అయిపోయింది. ప్రసిద్ధ నటుడు ప్రకాశ్రాజ్, బుల్లితెర ప్రముఖుడు రాహుల్ రామ్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిశి, సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ పుష్పేంద్ర సరోజ్, కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ, భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, అనేకమంది మాజీ సైనికాధికారులు, కొందరు సాధువులు జంతర్ మంతర్ సందర్శించి ఈ ఆందోళనకు మద్దతు పలికారు. ఒక వేపు మోదీ ప్రభుత్వ కుట్రలు, మరో వేపు ప్రభుత్వ ఒళ్లో కూర్చుని అసత్య వార్తలు ప్రచారం చేసే తాబేదారు మీడియా నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కురుస్తున్నందు వల్ల కొందరు విద్యార్థులు వాన కోట్లు వేసుకున్నారు. మరి కొంతమంది ప్లాస్టిక్ టెంట్ల కింద తలదాచుకుంటున్నారు. ఇంకా అనేకమంది వర్షంలో తడుస్తున్నా అక్కడి నుంచి కదలడం లేదు. ఆందోళన జరుగుతున్న నాలుగు వేపులా పోలీసుల బారికేడ్లు ఉన్నాయి. వేదిక మీద ఒక వేపు త్రివర’ పతాకం, రాజ్యాంగ ప్రతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ సోనం వాంగ్ చుక్‌కు మద్దతు తెలుపుతున్న యువతీ యువకులు ఒక్క ముద్ద తిని ఎన్నాళ్లయిందో. ప్రభుత్వం తమ మొర వినేటట్టు చేయడానికి అనేక మంది తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడడం బాధాకరమే అయినా భవిష్యత్తు మీద ఆశలు చిగురించే సూచనలూ కనిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండుతో మొదలైన ఈ ఆందోళన విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించాలన్న ఉద్యమం వేపు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆందోళన జరుగుతున్న చోటే కొందరు కవిత్వాలు చదువుతున్నారు. కొందరు వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు పాటలు పాడుతున్నారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్నది కేవలం దిల్లీలోని విద్యార్థులు మాత్రమే కాదని ఈ సాంస్కృతిక కార్యక్రమాలనుబట్టి అర్థం అవుతోంది. విద్యారంగంలోని అవకతవకలకు బలైపోతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ ఆందోళనలో భాగస్వాములవుతున్నారు. వివిధ రంగాలకు చెందిన వారు జంతర్‌మంతర్ చేరుకుని సంఘీభావం ప్రకటించడం, సహానుభూతి తెలియజేయడం ఆందోళనకారుల డిమాండ్లలో ఎంత నిజం ఉందో, అవి ఎంత వాస్తవమైనవో నిరూపిస్తున్నాయి. జూన్ ఆరున ప్రారంభమైన ఉద్యమం కేవలం ప్రతీకాత్మకంగా మిగిలిపోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలలోనూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను బలప్రయోగంతో అణచి వేసే ప్రయత్నాలూ జరిగాయి. జూన్ 20 నుంచి జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్దిష్ట రూపం తీసుకుంది. సాధారణంగా పోలీసులు ఇలాంటి ఆందోళనలను ఎక్కువ కాలం సహించరు. కానీ ఈసారి అలాంటి దుందుడుకు వైఖరి కనిపించడం లేదు. అంతమాత్రం చేత ఈ ఆందోళనను ప్రభుత్వం సహిస్తోందని కాదు. మరుగుదొడ్లకు తాళాలు వేయడం, మంచినీళ్లు అందకుండా చేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. జంతర్‌మంతర్ వేదిక మీద ఓ కోర్టు గది లాంటిది ఏర్పాటుచేసి ధర్మేంద్ర ప్రధాన్కు బేడీలు వేసి విచారిస్తున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి. ఈ ప్రజాకోర్టు ఓ నిరసన రూపం. ప్రభుత్వ అఘాయిత్యాలను ఎదుర్కుంటూనే అక్కడి యువజనులు తమ నినాదాలు వినిపిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమ ప్రతిధ్వనులు క్రమంగా విస్తరిస్తున్నాయి. సంయుక్త కిసాన్ దళ్లోని ఓ వర్గం జంతర్‌మంతర్ వచ్చి తమ సహానుభూతి తెలియజేసింది. సిక్‌కు మతస్థులు అక్కడ లంగర్ ఏర్పాటు చేసి భోజనాలు వడ్డిస్తున్నారు. విద్య అంగడి సరుకైపోయిన తరుణంలో, విద్య ఆర్.ఎస్.ఎస్.కు అప్పగిస్తున్న తరుణంలో ఈ ఆందోళన భవిష్యత్తుకు ఎంత మాత్రం అంధకార బంధురం కాదని నిరూపిస్తే ఎంత బాగుండును!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు