Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎర్రగుంటపల్లి నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలి...

ఎర్రగుంటపల్లి నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలి…

- Advertisement -

విశాలాంధ్ర – ముదిగుబ్బ: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) కారణంగా నివాసాలు కోల్పోయిన ఎర్రగుంటపల్లి గ్రామ నిర్వాసితులకు తక్షణమే పునరావాస నష్టపరిహారం చెల్లించాలని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ నేషనల్ కన్వీనర్ బాసినేని వెంగమేష్ చౌదరి, సీపీఐ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వారు మాట్లాడారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కారణంగా ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల పరిధిలోని సుమారు 13 గ్రామాల్లో భూములు, ఇళ్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ఆయా గ్రామాల్లో పలువురికి పునరావాస నష్టపరిహారం అందినప్పటికీ, ముదిగుబ్బ మండలం చిన్నకోట్ల పంచాయతీ పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామ నిర్వాసితులకు నేటికీ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని ఆరోపించారు.2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పెరిగిన భూముల ధరలు, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని సుమారు 250 మంది బాధితులకు రూ.25 కోట్లకు పైగా పునరావాస నష్టపరిహారం మంజూరు కావాల్సి ఉందని పేర్కొన్నారు.గత రెండు దశాబ్దాలుగా ఎర్రగుంటపల్లి నిర్వాసితులు తమ న్యాయమైన పరిహారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎర్రగుంటపల్లి గ్రామ నిర్వాసితులకు తగిన పునరావాస నష్టపరిహారం తక్షణమే మంజూరు చేసి, రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వెంగమేష్ చౌదరి, చల్లా శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు